
రాయసముద్రం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: హైడ్రా కమిషనర్
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని రాయసముద్రం చెరువును సుందరంగా అభివృద్ధి చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ మేరకు సమగ్ర అభివృద్ధి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామని ఆయన చెప్పారు. గతంలో రూపొందించిన ప్రణాళికల ప్రకారం హెచ్‌ఎండీఏ ద్వారా చేపట్టాల్సిన పనులకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగించి, అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.
చెరువు అభివృద్ధి పనులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయంటూ స్థానిక అధికారులు, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. చెరువు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు పరిస్థితిని గమనించి, నీటి ప్రవాహానికి ఆటంకాలపై అధికారులతో చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాయసముద్రం చెరువును కేవలం నీటి వనరుగా మాత్రమే కాకుండా, స్థానికులకు ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని కమిషనర్ పేర్కొన్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, చిన్నారుల కోసం ప్లే ఏరియా, పార్కులు, అన్ని వయసుల వారికి అనుకూలంగా వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వలస పక్షులకు నిలయంగా ఉన్న ఈ చెరువును సంపూర్ణంగా పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
చెరువులోకి మురుగు నీరు చేరకుండా దారి మళ్లించే పైపులైన్‌ల నిర్మాణం కోసం బీహెచ్‌ఈఎల్ యాజమాన్యంతో చర్చిస్తామని ఆయన తెలిపారు. వారి భూముల్లో పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటామని, అవసరమైన చోట ఎస్‌టీపీ ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. చెరువు భూములపై బీహెచ్‌ఈఎల్‌తో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల మధ్య ఉన్న సాంకేతిక వివాదాలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో చర్చించి స్పష్టత ఇస్తామని ఆయన చెప్పారు.
హైడ్రా అధికారులు వస్తే ఇళ్లు కూల్చివేస్తారన్న భయాందోళనలు అవసరం లేదని కమిషనర్ భరోసా ఇచ్చారు. ఇప్పటికే నిర్మించుకున్న ఇళ్లపై హైడ్రా జోక్యం ఉండదని, కేవలం నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలు, ఇతర అడ్డంకులను మాత్రమే తొలగిస్తామని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్రమణలు తొలగించాల్సి వస్తే, ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ పరిశీలనలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్, బీహెచ్‌ఈఎల్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. చెరువు చుట్టూ తిరుగుతూ, ఇన్‌లెట్ల ద్వారా మురుగు నీరు చేరుతున్న విధానాన్ని కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.
