
రాయలసీమ నీటి భద్రతకు రూ. 20,884 కోట్లతో ప్రాజెక్టులు: సీఎం చంద్రబాబు
కరవుకు గురయ్యే రాయలసీమలో శాశ్వత నీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.20,884 కోట్ల విలువైన సాగునీటి ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా అదనంగా 52 టీఎంసీల నీటి లభ్యత పెరగడంతో పాటు 4.37 లక్షల ఎకరాల సాగు స్థిరీకరణ, దాదాపు 9.80 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.
రాయలసీమలో చట్టబద్ధ అనుమతులు పొందిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, ఇప్పటికే ఉన్న కాలువలు, జలాశయాలను ఆధునికీకరించడం, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఈ దిశగా పలు కీలక ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.
హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
ఈ కార్యక్రమంలో హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టు ప్రధాన భూమిక పోషిస్తోంది. గత ఏడాది కాలంలో ఈ ప్రాజెక్టుపై సుమారు రూ.3,880 కోట్లు ఖర్చు చేయగా, కాలువల బలోపేతానికి మరో రూ.3,145 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను కుప్పం, మడకశిర వంటి చివరి ప్రాంతాల వరకు తరలించి, 6 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు సుమారు 33 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి.
గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టు కింద కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో సాగునీటి సామర్థ్యాన్ని పెంచే పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. అలాగే తెలుగు గంగా ప్రాజెక్టు పరిధిలో నీటి వినియోగాన్ని మెరుగుపరచడంతో పాటు చివరి ఆయకట్టు ప్రాంతాలకు సమర్థంగా నీటిని అందించే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. చెన్నై నగరానికి తాగునీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
రాష్ట్ర దీర్ఘకాలిక జల వ్యూహానికి పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులే పునాదిగా నిలుస్తాయని ప్రభుత్వం పేర్కొంది. గోదావరి మిగులు జలాలను సమర్థంగా వినియోగించుకోవడం, కరవు ప్రభావాన్ని తగ్గించడం, భవిష్యత్తులో నదుల అనుసంధానానికి అనుకూల పరిస్థితులు సృష్టించడం ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశ్యమని వెల్లడించింది. అదేవిధంగా వేదావతి ప్రాజెక్టు ద్వారా ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో సాగునీటి సౌకర్యం మెరుగుపడనుంది. చిత్తూరు జిల్లాలో ప్రతిపాదిత అడవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే నీవా బ్రాంచ్ కాలువ ద్వారా నీటి సరఫరా మరింత మెరుగవుతుందని ప్రభుత్వం తెలిపింది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఆధునికీకరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. దీని ద్వారా కృష్ణా జలాల రవాణా సామర్థ్యం పెరిగి, రాయలసీమ ప్రాంతంలో నీటి పంపిణీ మరింత సమర్థవంతంగా సాగుతుందని పేర్కొంది. అలాగే గోరకల్లు, అలగనూరు జలాశయాల పునరుద్ధరణ, బలోపేత పనులతో పాటు తుంగభద్ర ఆనకట్ట, శ్రీశైలం ప్లంజ్ పూల్ మరమ్మతులు చేపట్టి నీటి నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగునీటి లభ్యత పెరగనుండగా, జీడిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా హంద్రీ-నీవా నెట్‌వర్క్‌లో నీటి నిల్వ, నియంత్రణ, పంపిణీ మరింత మెరుగుపడుతుందని ప్రభుత్వం తెలిపింది.
ప్రధాన ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని 1,049 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ఆధునికీకరణకు రూ.4,500 కోట్ల ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించింది. ఇందులో ఆధునిక పంపింగ్ వ్యవస్థలు, విద్యుత్ ఆదా చేసే పరికరాలు, మెరుగైన విద్యుత్ సరఫరా, క్రమబద్ధమైన నిర్వహణ చేపడతారు. ఈ పనులు పూర్తయిన తర్వాత కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 8.2 లక్షల ఎకరాలకు పైగా విశ్వసనీయ సాగునీరు అందుతుందని అంచనా వేసింది. భూగర్భ జలాల పెంపు కోసం సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. మొత్తం 1,011 సాగునీటి చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టగా, వాటిలో 530 చెరువులు ఇప్పటికే నీటితో నిండినట్లు తెలిపింది.
ఈ సమగ్ర సాగునీటి వ్యూహం ద్వారా రాయలసీమలో దీర్ఘకాలిక నీటి భద్రత బలోపేతం కావడంతో పాటు సాగునీటి విశ్వసనీయత పెరిగి, అనిశ్చిత వర్షాలపై ఆధారపడే పరిస్థితి గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
