Let's talk: editor@tmv.in
రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగడానికి జగన్‌నే కారణం: మంత్రి నిమ్మల రామానాయుడు

రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగడానికి జగన్‌నే కారణం: మంత్రి నిమ్మల రామానాయుడు

Panthagani Anusha
27 ఫిబ్రవరి, 2026

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ముమ్మాటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కారణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. గురువారం శాసనమండలిలో వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సుదీర్ఘంగా ఆధారాలతో కూడిన సమాధానం ఇచ్చారు. తేదీలు, జీవో నంబర్లు కోర్టు తీర్పులను సాక్ష్యంగా చూపిస్తూ గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ సీమ ప్రజల ప్రయోజనం కోసం కాకుండా కేవలం తన స్వప్రయోజనాల కోసమే తలపెట్టారని మంత్రి విమర్శించారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా హడావుడిగా పనులు ప్రారంభించి ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. ఐదేళ్లలో రాయలసీమకు ఒక్క చుక్క నీరు కూడా అదనంగా ఇవ్వలేదు కానీ, మట్టి పనులు, గుంతల పేరుతో దాదాపు 900 కోట్ల రూపాయల బిల్లులు మాత్రం చేసుకున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. గాలేరు-నగరి, హంద్రీనీవా లింక్ పేరుతో పైపులు తెచ్చి సైట్‌లో పడేసి కాలయాపన చేశారే తప్ప చిత్తశుద్ధితో పని చేయలేదని విమర్శించారు.

అనుమతులు లేక భారీ జరిమానాలు

ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడిందని ఆవులపల్లి, బుదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ల పనులకు కనీస పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏకంగా 100 కోట్ల రూపాయల జరిమానా విధించిందని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వానికి సీమపై నిజమైన ప్రేమ ఉంటే నిబంధనల ప్రకారం అనుమతులు తెచ్చుకుని పనులు చేస్తారు కదా అని ఆయన ప్రశ్నించారు. కేవలం జేబులు నింపుకోవడానికే ఈ పనులన్నీ చేశారని ఆరోపించారు.

కోర్టులో అబద్ధపు అఫిడవిట్లు

సీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వ వైఖరేనని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. 2020లో ఎన్జీటీ పనులు ఆపాలని చెప్పినా వినకుండా పనులు కొనసాగించారని తీరా 2023 ఆగస్టు 11వ తేదీన కోర్టుకు భయపడి "ఈ ప్రాజెక్టు సాగునీటి కోసం కాదు కేవలం తాగునీటి కోసమే" అని 364 నంబర్ జీవో ద్వారా లిఖితపూర్వక అబద్ధాన్ని అఫిడవిట్ రూపంలో ఇచ్చారని మండిపడ్డారు. ఒకవైపు సీమకు సాగునీరు ఇస్తామని చెప్తూనే, మరోవైపు కోర్టులో తాగునీటి ప్రాజెక్టు అని చెప్పి ప్రజలను వంచించింది మీరు కాదా అని వైకాపా సభ్యులను నిలదీశారు.

నిధుల కేటాయింపులో భారీ వివక్ష

రాయలసీమ ప్రాజెక్టుల కోసం టీడీపీ, వైకాపా ప్రభుత్వాలు చేసిన ఖర్చుల మధ్య వ్యత్యాసాన్ని మంత్రి గణాంకాలతో వివరిస్తూ 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాయలసీమ జలవనరుల కోసం రూ. 14,000 కోట్లు ఖర్చు చేస్తే జగన్ తన ఐదేళ్ల పాలనలో కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కనీసం కడప జిల్లాకు, పులివెందులకు నీళ్లిచ్చే గోరకల్లు రిజర్వాయర్ మరమ్మతుల కోసం రూ. 60 కోట్లు అడిగినా పైసా ఇవ్వని వ్యక్తి జగన్ అని అలాంటి వారు సీమ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు.

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కొద్ది నెలల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా 203 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించామని హంద్రీనీవా ద్వారా 730 కిలోమీటర్ల మేర నీటిని తీసుకెళ్లి చివరి భూములను సైతం సస్యశ్యామలం చేస్తున్నామని పేర్కొన్నారు. నేడు సీమలోని చెరువులు, రిజర్వాయర్లన్నీ నిండుకుండల్లా ఉన్నాయని చంద్రబాబు నాయుడు హయాంలో సీమ ప్రజలు జేజేలు పలుకుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు.