
రాయదుర్గం మెట్రో నుంచి టీ హబ్ వరకు స్కైవాక్
హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లలో ఒకటైన సైబరాబాద్‌లో పాదచారుల భద్రత, నడక సౌలభ్యం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖను కూడా స్వయంగా నిర్వహిస్తూ, రాయదుర్గం నుంచి టీ హబ్ మార్గంలో స్కైవాక్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ నేతృత్వంలో సోమవారం సీనియర్ ట్రాఫిక్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెట్రో ప్రయాణికులు, ఐటీ ఉద్యోగులు, వాణిజ్య సముదాయాలకు వచ్చే సందర్శకుల వల్ల ఈ ప్రాంతంలో పాదచారుల రద్దీ అత్యధికంగా ఉంటోంది. దీనివల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ జాప్యాన్ని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు.
స్కైవాక్ మార్గం ఇలా..
ప్రతిపాదిత స్కైవాక్ రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ప్రారంభమై, ఐకియా ఫ్లైఓవర్, ఐఓసీఎల్ జంక్షన్ మీదుగా టీహబ్ వరకు కొనసాగనుంది. ఈ మార్గం రోజూ వేలాది మంది పాదచారులతో పాటు వాహనాల భారీ రాకపోకలను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా ఆఫీస్ సమయంలో ట్రాఫిక్ తీవ్రంగా ఉండటంతో పాటు, రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ప్రతిపాదనను సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో, పలు ప్రైవేట్ స్టేక్‌హోల్డర్లతో సమన్వయంతో రూపొందిస్తున్నారు. ప్రాజెక్టు మొదటి దశలో 500 మీటర్ల పొడవైన స్కైవాక్ నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా, టీహబ్ నుంచి మైండ్‌స్పేస్ సీ-గేట్‌ను కలిపేలా 400 మీటర్ల పొడవైన అండర్‌పాస్ నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఈ చర్యలతో సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో లాస్ట్ మైల్ కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా స్కైవాక్‌లు, అండర్‌పాస్‌లను కలిపిన నిరంతర పాదచారి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల పాదచారుల భద్రత మెరుగుపడటమే కాకుండా, వాహనాల రాకపోకలు కూడా సాఫీగా సాగనున్నాయి. అధికారుల అంచనాల ప్రకారం, ఈ చర్యలతో రాయదుర్గం, టీహబ్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ సుమారు 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.
