Let's talk: editor@tmv.in
రాయచోటి ప్రజలకు ఊరట: రిజిస్ట్రేషన్ ఛార్జీ పెంపు లేనట్టే!

రాయచోటి ప్రజలకు ఊరట: రిజిస్ట్రేషన్ ఛార్జీ పెంపు లేనట్టే!

Dantu Vijaya Lakshmi Prasanna
29 జనవరి, 2026

అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంత ప్రజలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాయచోటిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచవద్దంటూ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సానుకూలంగా స్పందించారు.

భారీగా పెరిగిన మార్కెట్ విలువలు

బుధవారం సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాయచోటి ప్రాంతంలో ఎదురవుతున్న రిజిస్ట్రేషన్ సమస్యలను వివరించారు. గతంలో రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్న సమయంలో భూముల మార్కెట్ విలువను అశాస్త్రీయంగా 200 నుంచి 300 శాతం వరకు పెంచారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం మారినప్పటికీ, అదే భారీ ధరలు కొనసాగుతుండటంతో సామాన్యులపై భారం పడుతోందని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతిపాదిత పెంపుపై ఆందోళన

వాస్తవ భూమి ధరల కంటే రిజిస్ట్రేషన్ విలువల అధికంగా ఉండటంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని మంత్రి తెలిపారు. దీనికి తోడు ఫిబ్రవరి 1, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను పెంచే ప్రతిపాదన అమలులోకి వస్తే, రాయచోటి ప్రజలు మరింత ఇబ్బంది పడతారని ఆయన వివరించారు.

ఈ నేపథ్యంలో, రాయచోటి ఎస్ఆర్ఓ పరిధిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలి. ఫిబ్రవరి 1 నుంచి అమలు చేయాలనుకుంటున్న అదనపు పెంపును నిలిపివేయాలి.

రెవెన్యూ మంత్రి హామీ

మంత్రి మండిపల్లి విజ్ఞప్తిపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సానుకూలంగా స్పందించారు. రాయచోటి ప్రజలపై అదనపు భారం పడకుండా చూస్తామని, అక్కడ మార్కెట్ విలువల పెంపును నిలిపివేసే అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో రాయచోటి ప్రాంతంలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలు మళ్లీ పుంజుకుంటాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల సవరణకు శ్రీకారం చుట్టింది, ఇది ఫిబ్రవరి 1, 2026 నుండి అమలులోకి రానుంది. ఈ సవరణలో భాగంగా పట్టణ ప్రాంతాలు, మున్సిపాలిటీలు, అభివృద్ధి చెందుతున్న కారిడార్లలో భూముల విలువలు సగటున 10% నుండి 20% వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే, వాస్తవ మార్కెట్ ధర కంటే ప్రభుత్వ ధర ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విలువల తగ్గింపు కూడా చేపట్టడం విశేషం. రాజధాని అమరావతి ప్రాంతంలో మాత్రం ప్రస్తుతానికి ఈ పెంపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రిజిస్ట్రేషన్ ఛార్జీల శాతంలో ఎలాంటి మార్పు లేనప్పటికీ, భూమి యొక్క ప్రాథమిక మార్కెట్ విలువ పెరగడం వల్ల సామాన్యులపై రిజిస్ట్రేషన్ భారం పెరగనుంది. కొత్త ధరల అమలుకు ముందు పాత ధరలకే రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రజలు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. ప్రభుత్వం ఈ కొత్త ధరలపై అభ్యంతరాలు తెలపడానికి జనవరి 29 వరకు గడువు ఇచ్చింది, ఆ తర్వాత తుది ధరలను అధికారికంగా ఖరారు చేయనుంది.

రాయచోటి ప్రజలకు ఊరట: రిజిస్ట్రేషన్ ఛార్జీ పెంపు లేనట్టే! - Tholi Paluku