Let's talk: editor@tmv.in
రామాయపట్నం బిపిసిఎల్ ప్రాజెక్టుకు భారీ ఊతం: రూ. 20 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు

రామాయపట్నం బిపిసిఎల్ ప్రాజెక్టుకు భారీ ఊతం: రూ. 20 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు

Panthagani Anusha
11 ఫిబ్రవరి, 2026

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉపాధిని తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నెల్లూరు జిల్లా రామాయపట్నం ఓడరేవు సమీపంలో ఏర్పాటు కానున్న 'భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్' (బిపిసిఎల్) గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు భారీ ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సుమారు రూ. 20.41 కోట్ల విలువైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను పూర్తిగా మినహాయిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామ పరిధిలో ఉన్న 6,000 ఎకరాలకు పైగా భూమిని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు (ఏపీఎంబి) నుంచి ఏపీఐఐసీకి అక్కడి నుంచి బిపిసిఎల్‌కు బదిలీ చేసే ప్రక్రియకు ఈ మినహాయింపు వర్తించనుంది. ఇందులో రూ. 17.69 కోట్ల స్టాంప్ డ్యూటీతో పాటు రూ. 2.72 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది. కాగా ప్రాజెక్టు ప్రారంభ దశలో కంపెనీపై ఆర్థిక భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఈ మేరకు వెసులుబాటు కల్పించారు.

పారిశ్రామిక విధానం 4.0 కింద ప్రోత్సాహకాలు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 'ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0'లో భాగంగానే ఈ రాయితీలు కల్పించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మెగా ప్రాజెక్టులను ఆకర్షించడం ద్వారా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అగ్రపథాన నిలపాలన్న సంకల్పంతో సుమారు లక్ష కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టే బిపిసిఎల్‌కు 20 ఏళ్ల కాలపరిమితితో ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో భాగంగా మూలధన వ్యయంలో 75 శాతం వరకు ప్రోత్సాహకాలు అందనున్నాయి.

లక్ష కోట్ల పెట్టుబడి.. దశలవారీగా పనులు

సుమారు 9 నుంచి 12 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో నిర్మించనున్న ఈ రిఫైనరీ కోసం బిపిసిఎల్ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 4,843 కోట్లతో మొదలై 2029-30 నాటికి మొత్తం పెట్టుబడి రూ. 96,862 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 43.5 శాతం మూలధన సబ్సిడీతో పాటు ఆపరేషన్ దశలో 100 శాతం జీఎస్టీ రీఫండ్ వంటి అసాధారణ రాయితీలను ప్రకటించింది.

తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ప్రభుత్వం కొంత ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ దీర్ఘకాలంలో ఈ ప్రాజెక్టు వల్ల వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రామాయపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమల విస్తరణతో పాటు, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్నే మార్చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.