
రామాయపట్నం పోర్టును కూటమి ప్రభుత్వం స్కామ్‌గా మారుస్తోంది: వైఎస్ జగన్ ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడే ప్రతిష్టాత్మక రామాయపట్నం పోర్టును ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక పెద్ద స్కామ్‌గా మారుస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకుంటూ.. రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూరుస్తూ, ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక మోసాలను నిలదీశారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పోర్టు ఆధారిత ప్రగతి అత్యంత కీలకమని భావించి, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట అనే మూడు పోర్టుల నిర్మాణాన్ని అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్లిందని జగన్ గుర్తుచేశారు. ఈ మూడు పోర్టులకు సంబంధించి భూసేకరణ, ఆర్థిక క్లోజర్లతో సహా అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులను తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని వివరించారు. ఈపీసీ కాంట్రాక్టులను సైతం కుదుర్చుకుని, జూన్ 2024 నాటికే గణనీయమైన భౌతిక పురోగతిని సాధించామన్నారు.
రామాయపట్నం పోర్టు అభివృద్ధి వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షితమయ్యాయని జగన్ పేర్కొన్నారు. బీపీసీఎల్ రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో 9-12 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అలాగే ఇండోసోల్ సోలార్ సంస్థ పూర్తి స్థాయి "క్వార్ట్జ్ టు మాడ్యూల్" తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోందని, ముడి పదార్థాల దిగుమతి, తయారైన సోలార్ మాడ్యూల్‌ల ఎగుమతులకు రామాయపట్నం లోతట్టు నౌకాశ్రయం అత్యంత కీలకమని వివరించారు.
అదే విధంగా వైఎస్సార్ కడప జిల్లాలో నిర్మిస్తున్న సమీకృత ఉక్కు కర్మాగార అవసరాల కోసం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ రామాయపట్నం పోర్టులో రెండు బెర్త్‌లను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మందికి ఉపాధి లభించడంతో పాటు రాష్ట్రానికి పన్ను, పన్నేతర ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.
రూ. 4,929 కోట్ల పోర్టు.. కేవలం రూ. 1,500 కోట్లకే దారాదత్తం?
రాష్ట్రానికి ఇంతటి అపారమైన పన్ను, పన్నేతర ఆదాయాలు, వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే ఈ పోర్టును టీడీపీ పెద్దలు తమ స్వంత లాభాల కోసం ఒక స్కామ్‌గా మారుస్తున్నారని జగన్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 4,929 కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న పోర్టును, కేవలం రూ. 1,500 కోట్ల ముందస్తు చెల్లింపులకే ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా.. మిగిలిన రూ. 3,500 కోట్లకు పైగా అప్పుల భారాన్ని, దాని వడ్డీలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోందని అన్నారు. ఇదేనా ఆర్థిక నిర్వహణ? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జగన్ ప్రశ్నించారు.
