
రామన్ మెగసెసే అవార్డు అందుకున్న ‘ఎడ్యుకేట్ గర్ల్స్’
ఒకప్పుడు తల్లిదండ్రులు బాలికలకు చదువు అవసరం లేదని భావించిన రాజస్థాన్ గ్రామాల్లో, ఈ రోజు అమ్మాయిలే పాఠశాలల్లో అగ్రగాములు నిలుస్తున్నారు. ఆ మార్పు వెనుక ఉన్న శక్తి – ఒక మహిళ. ఆమె కల. ఒక సాహసయాత్ర. ఆమె సఫీనా హుస్సేన్, ఆమె స్థాపించిన సంస్థ ‘ఎడ్యుకేట్ గర్ల్స్. ఈ రోజు ఆ స్వచ్చంధ సంస్థ ఆసియా నోబెల్ ప్రపంచ ప్రఖ్యాత రామన్ మెగసెసే అవార్డుని శుక్రవారం అందుకుంది. ఈ గౌరవాన్ని దేశవ్యాప్తంగా విద్యా మార్పు కోసం శ్రమిస్తున్న 55,000 మంది వాలంటీర్లు, ఫీల్డ్ కోఆర్డినేటర్లు, యువ మెంటర్లుకు అంకితం చేసింది. ఈ అవార్డు ఆగస్టు 31న ప్రకటించగా, శుక్రవారం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని మెట్రోపాలిటన్ థియేటర్‌లో జరిగిన వేడుకలో అధికారికంగా ప్రదానం చేశారు. ‘ఈ గౌరవం నా సొంతం కాదు. ఇది 55 వేల మంది వాలంటీర్లది, ప్రతి గ్రామంలోని చదువుకున్న ఆ బాలికలది, తమ కలలకు కొత్త దారులు చూపిన వారి ఆశయానిదేనని మెగసెసే అవార్డును స్వీకరిస్తూ సఫీనా హుస్సేన్ గర్వంగా అన్నారు.
కలచివేసిన సంఘటనలు
పేదరికం, లింగ అసమానత, అక్షరాస్యతలేమి అనేవి ఒకదానికొకటి సంబంధమున్న సమస్యల చట్రం. ఈ మూడు అంశాలు భారత గ్రామీణ బాలికల జీవితాన్ని దశాబ్దాలుగా ఇబ్బందుల సుడిగుండంలో బంధించాయి. కానీ ఆ బంధనాన్ని ఛేదించి విద్య వెలుగులోకి నడిపించిన శక్తి ఒకటుంది. అది ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థ. ఒక బాలిక చదివితే, కుటుంబం అభివృద్ధి చెందుతుంది. సమాజం మారుతుంది అనే నమ్మకంతో సఫీనా హుస్సేన్ 2007లో ఈ సంస్థను స్థాపించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివిన ఆమె, విదేశాల్లోని పేద ప్రజల మధ్య పనిచేసి తిరిగివచ్చి భారత గ్రామీణ బాలికల దయనీయ విద్యా పరిస్థితిని చూసి దిగ్భ్రాంతి చెందింది. రాజస్థాన్‌లోని పల్లెలలో తిరుగుతూ, అక్కడి బాలికలు పాఠశాలకు ఎందుకు రావడం లేదో తెలుసుకోవాలనుకుంది. ఆమెకి ఎదురైన సమాధానం ‘అమ్మాయికి చదువు ఎందుకు? పెళ్లి అయిపోతుంది కదా! ఆ సమాధానం ఆమె మనసును కదిలించింది. పేదరికం, అజ్ఞానం, సంప్రదాయాల బంధనంలో చిక్కుకున్న బాలికల జీవితాలను మార్చాలని ఆమె నిర్ణయించుకుంది. దీంతో విద్యే శాశ్వత పరిష్కారం అని నమ్మి రాజస్థాన్‌లోని కొన్ని గ్రామాల నుంచి ప్రారంభించిన చిన్న ప్రయత్నం, ఈ రోజు నాలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చెంది మహా ఉద్యమంగా మారింది.
18 లక్షల బాలికల జీవితాల్లో మార్పు
మొదట సఫీనా గ్రామాల్లోకి వెళ్లినప్పుడు ప్రజలు ఆమెను చూసి ఇంటి తలుపులు మూసేవారు. బయటివాళ్లు ఊరికే వచ్చి పోతారు, కానీ మన జీవితాలు మారవు అనే నిరాశా భావం అక్కడి ప్రజల్లో ఉండేది. ఒక కుటుంబాన్ని, ఒక అమ్మాయిని పాఠశాలకు పంపించేందుకు వారాల తరబడి ఒప్పించాల్సి వచ్చేది. అయితే మేం పుస్తకాలు ఇచ్చే ముందు, వారి మనసులు తెరిచాం అన్నారు. ఆ సమయంలో రాజస్థాన్ గ్రామాల్లో పాఠశాలలు దూరంగా ఉండేవి.బాత్రూంలు లేకపోవడం, మహిళా ఉపాధ్యాయుల కొరత, రోడ్ల లేమి వల్ల తల్లిదండ్రులు అమ్మాయిలను పంపడానికి ఇష్టపడేవారు కాదు.
ఇక బాల్య వివాహం ఒక పెద్ద శాపం. 12 ఏళ్లకే పెళ్లి చేసేస్తే, విద్య ఎక్కడి నుంచి వస్తుంది? దీంతో సంస్థ వారు ధృడంగా నిశ్చయించుకున్నారు. కచ్చితంగా మార్పు కోసం శ్రమించి తీరాల్సిందేనని. దీంతో ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ ఇప్పటివరకు 1.8 మిలియన్ (18 లక్షల) పైగా బాలికలను తిరిగి పాఠశాలలకు చేర్చింది. అలాగే 2 కోట్లకు పైగా పిల్లలు ఈ సంస్థ పాఠ్య కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందారు. ఈ ఉద్యమం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని 30,000 కంటే ఎక్కువ గ్రామాల్లో చైతన్యం తీసుకువచ్చింది. ఈ విజయానికి వెనుక ఉన్న అద్భుత శక్తి ‘టీమ్ బాలిక’. దేశవ్యాప్తంగా 55 వేల మంది యువ వాలంటీర్లు గ్రామాల్లోకి వెళ్లి పాఠశాలకు వెళ్లని బాలికలను గుర్తించి, వారి తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలల్లో చేర్చుతున్నారు. ఇంటింటి దాకా విద్యా సందేశం తీసుకెళ్లే ఈ వాలంటీర్లు పేద గ్రామాల్లో ఆశాజ్యోతి వెలిగిస్తున్నారు.
చదువు పట్ల ఆసక్తి
బాలికల్ని కేవలం పాఠశాలల్లో చేర్చడమే కాదు.వారు చదవగలగాలి, అర్థం చేసుకోవాలి, అభివృద్ధి చెందాలి అనే లక్ష్యంతో సంస్థ ప్రత్యేకంగా ‘లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. గణితం, హిందీ, ఇంగ్లీష్ వంటి అంశాల్లో ఆటల రూపంలో బోధన, ప్రత్యేక పాఠ్య సాధనాలు, పరీక్షల ద్వారా పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతున్నారు. సంస్థ కేవలం పాఠశాల స్థాయిలో కాకుండా, తల్లిదండ్రుల మనస్తత్వంలో మార్పు తీసుకురావడానికి కూడా నిరంతరం శ్రమిస్తోంది.‘బాలిక కూడా చదువుకోవాలి’ అనే భావనను గ్రామ సభల్లో, మహిళా సంఘాల్లో విస్తృతంగా వ్యాప్తి చేస్తోంది. దీనివల్ల బాల్య వివాహాలు తగ్గి, బాలికల విద్యా కొనసాగింపు పెరిగింది.
సాంకేతికతతో ముందడుగు
మొదట్లో ఎడ్యుకేట్ గర్ల్స్‌కు పెద్ద ఫండింగ్ లేదు. కొద్ది మంది స్నేహితుల సహకారంతో, చిన్న దాతలతో మొదలు పెట్టిన ఈ యాత్రలో సఫీనా తన జీతం కూడా వదిలి పెట్టింది. కార్యకర్తలు గ్రామాల్లోనే ఉండి పనిచేశారు. జీతం తక్కువైనా, ఆశయం గొప్పగా ఉండడంతో వలంటీర్లు కూడా ముందడుగు వేశారు. ప్రతి గ్రామంలోని విద్యార్థుల వివరాలు డిజిటల్ యాప్‌ల ద్వారా నమోదు చేసి, ఎవరైనా పాఠశాలకు గైర్హాజరు అయితే వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటారు. ఇది దేశంలో విద్య రంగంలో వినూత్న పద్ధతిగా నిలిచింది. సంస్థ ‘పే ఫర్ సక్సెస్’ మోడల్ ద్వారా పనిచేస్తోంది. అంటే – లక్ష్యాలు సాధించినప్పుడు మాత్రమే దాతలు నిధులు విడుదల చేస్తారు. ఇది పారదర్శకతకు, ఫలితాలకు ప్రాధాన్యం ఇచ్చే కొత్త ఆర్థిక నమూనాగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
అంతర్జాతీయ గుర్తింపు
సఫీనా హుస్సేన్ నాయకత్వంలో ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ సంస్థకు అనేక అవార్డులు లభించాయి.
• రామన్ మెగసెసే అవార్డు (2025)
• స్కోల్ అవార్డు. ఇది ప్రపంచస్థాయి సామాజిక వ్యాపార రంగంలో ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం. అమెరికాలోని స్కోల్ పౌండేషన్ అనే సంస్థ 2005 నుంచి ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తోంది.(ఈ అవార్డును గతంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ మొహమ్మద్ యూనస్ (గ్రామీణ బ్యాంక్), మలాలా యూసుఫ్‌జాయ్, కైలా ముహమ్మద్, బిల్ డ్రేటన్ వంటి ప్రముఖులు అందుకున్నారు).
• నారీ శక్తి పురస్కార్
• ఫోర్బ్స్ ఆసియా ఫిలాంత్రఫీ లీడర్స్ జాబితాలో చోటు పొందింది.
బాలికల చదువు– భవిష్యత్తుకు పునాది
ఇప్పుడు పాఠశాలకు వెళ్లని బాలికల సంఖ్య గణనీయంగా తగ్గింది. చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, స్వయం ఆధారిత జీవితం, మహిళా సాధికారత వంటి అంశాల్లో ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ఉద్యమం మైలురాయిగా మారింది. ఒక గ్రామంలో ఒక బాలికను చదివించడం అంటే ఆమె కుటుంబానికి మంచి భవిష్యత్తును అందించడం. అలాంటి లక్షల కథల వెనుక ఎడ్యుకేట్ గర్ల్స్ శ్రమ ఉంది, ఆ సంస్థ స్థాపకురాలు సఫీనా హుస్సేన్ దృష్టి ఉంది. బాలిక చదువుకుంటే –సమాజం ఎదుగుతుంది.ఇదే ఈ సంస్థ నిజమైన మంత్రం. ఇది కేవలం విద్యా ఉద్యమం కాదు. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం. భారతదేశ భవిష్యత్తు పుటల్లో బంగారు అక్షరాలతో రాయ దగ్గ పేరు ఎడ్యుకేట్ గర్ల్స్.
