Let's talk: editor@tmv.in
రామచంద్రపురంలో జాబ్ మేళా: ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు

రామచంద్రపురంలో జాబ్ మేళా: ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు

Panthagani Anusha
24 ఫిబ్రవరి, 2026

స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలను సుగమం చేసే లక్ష్యంతో రామచంద్రపురం నియోజకవర్గంలో భారీ జాబ్ మేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి భవన్ సమన్వయంతో ఈ నెల 25వ తేదీన 'జాబ్ మేళా–37, 38' నిర్వహించనున్నట్లు నిర్వాహక ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ జాబ్ మేళాలో దేశీయంగా పేరుగాంచిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థలైన అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్, రైచెమ్ మెడికేర్, న్యూలాండ్ ఫార్మా, సోధన్ ల్యాబ్స్, స్పైకా లాబొరేటరీస్ పాల్గొంటున్నాయి. ప్రొడక్షన్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను బి.ఎస్సీ, ఎమ్.ఎస్సీ, ఫార్మా లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 26 ఏళ్ల లోపు పురుష అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.14,000 నుంచి రూ.20,000 వరకు వేతనంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆయా కంపెనీల యూనిట్లలో నియామకాలు ఉంటాయని వెల్లడించారు.

మరోవైపు రిటైల్ ఫార్మసీ రంగంలో స్థిరపడాలనుకునే యువతకు అపోలో ఫార్మసీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నారు. ఫార్మాసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ పోస్టులకు డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ లేదా పదవ తరగతి నుండి ఏదైనా డిగ్రీ చేసిన 18 నుంచి 35 ఏళ్ల అభ్యర్థులు హాజరుకావచ్చు. వీరికి నెలకు రూ.11,500 నుంచి రూ.18,000 వరకు వేతనం చెల్లిస్తారు. ఎంపికైన వారు కాకినాడ, గొల్లపాలెం, రాజమండ్రి, మండపేట పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

కాగా నిరుద్యోగ యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను వెంట తీసుకురావాలని సూచించారు. అర్హత, ప్రతిభ ఆధారంగా నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు.