
రామగుండంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహచర మంత్రులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం రామగుండంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న భట్టి విక్రమార్క, రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల లేని నిరుపేదలకు ఆత్మగౌరవంతో జీవించడానికి అవసరమైన ఏర్పాట్లపై వివరాలు తెలిపారు.
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రంలో 4.50 లక్షల మందికి ఇండ్లు అందించే లక్ష్యంతో ఇంతవరకు కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల నిర్మాణం జరుగుతున్నదని, దీని ద్వారా పేదల ఆత్మగౌరవ జీవన స్థితిని పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి పేర్కొన్నారు.
పేదలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం సన్నబియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నదని ఆయన చెప్పారు.ఇదిలా ఉండగా, భట్టి విక్రమార్క తన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను పూర్తి చేస్తున్నారని తెలిపారు. రామగుండం ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం ఇచ్చిందని, త్వరలోనే ప్రాజెక్ట్ ప్రారంభం ఖరారవుతుందని డిప్యూటి సీఎం తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం లక్ష్యమని, ఈ లక్ష్య సాధనలో ప్రజా పాలన కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన గుర్తుచేశారు.
సింగరేణి ఉద్యోగుల కోసం ప్రభుత్వం కోటి రూపాయల ప్రమాద బీమా అమలు చేస్తుందని, అలాగే 5.14 లక్షల రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు కూడా అదే విధమైన బీమా సదుపాయం త్వరలో అందజేయబడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందిస్తూ ముందుకు సాగుతోందని, ఆర్థిక పరిస్థితి సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రగతిని సమపాళ్లలో తీసుకెళ్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు.
సింగరేణి పరివాహక ప్రాంతంలో 76 జీవో వల్ల ఏర్పడిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, సహచర మంత్రులతో చర్చించి, అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలను అందజేస్తామని ఆయన తెలిపారు. అవినీతి ప్రభుత్వాన్ని పాతరేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పరిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే అన్ని ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి, ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు పలికే అవకాశం ఉన్నదని ఆయన చెప్పినారు.
ఈ సందర్భంగా మంత్రి పొగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీకి అడ్రస్ లేకుండా ప్రతి ఎన్నికల్లో ఓడిస్తూ, స్థానిక సమస్యలను పట్టించుకోని నేతలను నిర్లక్ష్యం చేశారు అని విమర్శించారు. సొంత ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయలేని నాయకులు, తెలంగాణ మహిళలకు ఎలా న్యాయం చేస్తారని చెప్పాల్సిన సమయం ఇదే అని అన్నారు.
