Let's talk: editor@tmv.in
రాబోయే 5 ఏళ్లలో బీహార్‌లో కోటి ఉద్యోగాలు సృష్టిస్తాం: గవర్నర్

రాబోయే 5 ఏళ్లలో బీహార్‌లో కోటి ఉద్యోగాలు సృష్టిస్తాం: గవర్నర్

Pinjari Chand
4 డిసెంబర్, 2025

బీహార్‌లో తాజాగా అధికారంలోకి వచ్చిన నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో కోటి ఉద్యోగ అవకాశాలు సృష్టించే లక్ష్యాన్ని నిర్దేశించిందని రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బుధవారం వెల్లడించారు. బీహార్ శాసనసభ, శాసన మండలి ఉమ్మడి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యంగా మహిళలు భారీ సంఖ్యలో ఓటు వేసి ఎన్నికలను విజయవంతం చేశారని, ఎన్నికల సంఘం ఎన్నికలను అద్భుతంగా నిర్వహించిందని కొనియాడారు. 2005 నవంబర్ 24 నుంచి నితీశ్ కుమార్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఈ పని మరింత వేగంగా కొనసాగుతుందని గవర్నర్ తెలిపారు.

కోటి ఉద్యోగాల లక్ష్యం

2020లో ప్రవేశపెట్టిన 'సాత్ నిశ్చయ్-2' కార్యక్రమంలో 10 లక్షాల ప్రభుత్వ ఉద్యోగాలు, మరో 10 లక్షాల ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించాం. ఇప్పటివరకు 50 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయి. వీటిలో 10 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు. ఇక రాబోయే 5 ఏళ్లలో మరో కోటి ఉద్యోగాలు సృష్టిస్తామని గవర్నర్ తెలిపారు.

కేంద్రం నుంచి పూర్తి సహకారం

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బీహార్‌కు అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని, గత ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రోడ్లు, పరిశ్రమలు, పర్యాటకం, ఆరోగ్యం, వరదల నివారణకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని గవర్నర్ గుర్తు చేశారు. 2025 బడ్జెట్‌లో మఖానా బోర్డు ఏర్పాటు, కొత్త విమానాశ్రయాలు, పశ్చిమ కోసి కాల్వ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారని తెలిపారు. ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు బీహార్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అన్నారు.

చట్టం, వ్యవస్థ పరిరక్షణ

2005కి ముందు బీహార్‌లో ఉన్న 'జంగిల్ రాజ్' పరిస్థితులతో పోల్చుతూ, ఇప్పుడు ప్రేమ, సౌభ్రాతృత్వం, శాంతి వాతావరణం నెలకొన్నాయని, ప్రజలు ఏ భయం లేకుండా జీవిస్తున్నారని గవర్నర్ అన్నారు. పోలీసు సిబ్బంది సంఖ్య 2005లో 42,481 నుంచి ఇప్పుడు 1.26 లక్షలకు పెరిగిందన్నారు. 2028 నాటికి 2.29 లక్షలకు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధిక మహిళా పోలీసులు బీహార్‌లోనే ఉన్నారు. పోలీస్ స్టేషన్ల సంఖ్య 814 నుంచి 1,380కు పెరిగింది. అత్యవసర సేవల కోసం 112 నంబర్ అందుబాటులో ఉందని తెలిపారు.

మహిళల సాధికారత

• ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్

• పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 50% రిజర్వేషన్

• జీవికా స్వయం సహాయక బృందాలు: 11 లక్షల గ్రూపులు, 1.40 కోట్ల మంది మహిళలు సభ్యులు

• పట్టణ ప్రాంతాల్లో మరో 1.41 లక్షల గ్రూపులు

ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద ఇప్పటివరకు 1.56 కోట్ల మంది మహిళలకు రూ.10,000 చొప్పున అందజేశామని, మిగతావారికి త్వరలోనే అందుతుందని, వ్యాపారం ప్రారంభించిన వారికి అదనంగా రూ.2 లక్షల వరకు సాయం అందుతుందని గవర్నర్ తెలిపారు.

మౌలిక సదుపాయాలు

రాష్ట్రంలోని దూరంగా ఉన్న జిల్లాల నుంచి పాట్నా రావాలంటే గరిష్ఠంగా 6 గంటలు మాత్రమే పడుతోందని, ఐదు కొత్త ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంతో ఈ సమయం మరింత తగ్గుతుందని గవర్నర్ పేర్కొన్నారు.

రాబోయే 5 ఏళ్లలో బీహార్‌లో కోటి ఉద్యోగాలు సృష్టిస్తాం: గవర్నర్ - Tholi Paluku