
రాబోయే రోజుల్లో భారత్–అమెరికాల మధ్య అద్భుత అవకాశాలు : సెర్జియో గోర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహిత వర్గానికి చెందిన కీలక వ్యక్తిగా పేరున్న అమెరికా రాయబారి సెర్జియో గోర్, భారత్–అమెరికా సంబంధాల్లో తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో న్యూఢిల్లీకి చేరుకున్నారు. గోర్ గత ఏడాది నవంబర్ లో భారత్‌లో అమెరికా రాయబారిగా ప్రమాణ స్వీకారం చేశారు.శుక్రవారం రాత్రి జాతీయ రాజధానికి చేరుకున్న అనంతరం ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ భారత్‌కు తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉంది. మన రెండు దేశాలకు రాబోయే రోజుల్లొ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే గోర్ భారత్‌కు రావడం, రెండు దేశాల మధ్య తాజాగా చెలరేగిన మరో వివాదం నేపథ్యంలో చోటు చేసుకుంది. గత ఏడాది ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరలేకపోయిందంటే, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ కాల్ చేయలేదనే కారణమేనని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి.
ఈ వ్యాఖ్యలను న్యూఢిల్లీ శుక్రవారం తీవ్రంగా ఖండిస్తూ అవి తప్పైనవి, అసత్యమైనవి అని స్పష్టం చేసింది. ఆగస్టులో అధ్యక్షుడు ట్రంప్, సెర్జియో గోర్‌ను న్యూఢిల్లీలో తదుపరి అమెరికా రాయబారిగా నియమించిన సమయంలో గోర్ వైట్ హౌస్ పర్సనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. భారత వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం సుంకాలను రెట్టింపు చేసి 50 శాతం వరకు పెంచిన తర్వాత, భారత్–అమెరికా సంబంధాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇందులో రష్యా ముడి చమురు కొనుగోళ్లపై భారత్‌కు విధించిన అదనపు 25 శాతం సుంకం కూడా ఉంది. టారిఫ్ అంశంతో పాటు, గత ఏడాది మేలో భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణను తానే ముగించానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, అలాగే అమెరికా కొత్త వలస విధానం వంటి అంశాలపై కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి.
అక్టోబర్‌లో అమెరికా సెనేట్, సెర్జియో గోర్‌ను భారత్‌లో తదుపరి అమెరికా రాయబారిగా నియమించేందుకు ఆమోదం తెలిపింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ భారత్‌తో ఉన్న మా వ్యూహాత్మక భాగస్వామ్యం అమెరికాకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ సంబంధాల్లో ఒకటి. దాన్ని మరింత బలోపేతం చేయడంలో సెర్జియో కీలక పాత్ర పోషిస్తారని నేను విశ్వసిస్తున్నాను అని అన్నారు. తన కొత్త బాధ్యతపై గోర్ స్పందిస్తూ దాన్ని జీవితంలో లభించిన గొప్ప గౌరవంగా పేర్కొంటూ, భారత్–అమెరికా సంబంధాలను మరింత పటిష్టం చేయాలని ఎదురుచూస్తున్నాను అన్నారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ ప్రచారానికి సంబంధించిన రాజకీయ చర్యల కమిటీ (పీఏసీ)లో గోర్ కీలక పాత్ర పోషించారు. కొత్త ప్రభుత్వంలో రాజకీయ నియామకాల పరిశీలన బాధ్యత ఆయనకు అప్పగించడంతో ఆయన ప్రభావం మరింత పెరిగింది. గత ఏడాది జనవరిలో అప్పటి అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తన పదవికి రాజీనామా చేయడంతో, ట్రంప్ ప్రభుత్వం కొత్త రాయబారిని నియమించేందుకు మార్గం సుగమమైంది. సెనేట్ ఆమోదం వచ్చిన కొద్ది రోజులకే, అక్టోబర్‌లో గోర్ ఆరు రోజుల పాటు భారత్ లో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కూడా కలిశారు.
