
రాబోయే కాలం దేశానికి పెద్ద పరీక్ష: ప్రధాని మోడీ
పశ్చిమాసియా యుద్ధం దీర్ఘకాలిక ప్రభావాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు శక్తివంతమైన (ఎంపవర్డ్) బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్రాలు, కేంద్రం కలిసి ‘టీమ్ ఇండియా’గా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యసభలో చేసిన ప్రకటనలో, యుద్ధం కారణంగా ఏర్పడుతున్న తీవ్రమైన దుష్ప్రభావాలపై మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ కాలంలో నిపుణుల బృందాలు ఎలా సవాళ్లను ఎదుర్కొన్నాయో గుర్తుచేస్తూ, అదే తరహాలో ఇప్పుడు ఏర్పాటైన ఈ ఏడు బృందాలు ఇంధనం, ఎరువులు, గ్యాస్, సరఫరా గొలుసులు (సప్లై చైన్స్), ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై వ్యూహాలు రూపొందిస్తాయని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు చర్చలు, రాజనీతి ప్రయత్నాలే మార్గమని భారత్ అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సహా అన్ని దేశాలతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, ఉద్రిక్తతలు తగ్గించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ యుద్ధం వల్ల ముడి చమురు, గ్యాస్, ఎరువుల సరఫరాలో అపూర్వ సవాళ్లు ఎదురవుతున్నాయని అంగీకరించిన ఆయన, భవిష్యత్తులో ఆత్మనిర్భరతే ఏకైక మార్గమని పేర్కొన్నారు. పరిస్థితులు వేగంగా మారుతున్నందున ప్రతి పరిస్థితికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రంగా ఉన్నదని పేర్కొంటూ, ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. నల్లబజార్, నిల్వదోపిడీ (హోర్డింగ్)ను అరికట్టాలని సూచించారు.
సమగ్ర వ్యూహంతో ఎదుర్కోంటున్నాం
దేశ ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని వనరుల నుంచి చమురు, గ్యాస్ సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఎరువుల సరఫరా కూడా సమృద్ధిగా ఉండేలా ఏర్పాట్లు చేశామని, రైతులపై ఎటువంటి భారమూ పడనివ్వమని హామీ ఇచ్చారు. ఈ సంక్షోభాన్ని తాత్కాలిక, మధ్యకాల, దీర్ఘకాల పరిమాణాల్లో సమగ్ర వ్యూహంతో ఎదుర్కొంటున్నామని చెప్పారు. దిగుమతి-ఎగుమతి కార్యకలాపాలపై సమస్యలను పరిశీలించేందుకు అంతర్గతంగా మంత్రుల బృందం ఇప్పటికే పనిచేస్తోందని వెల్లడించారు. కోవిడ్ సమయంలో ఏర్పాటు చేసినట్లే, నిపుణులు, అధికారులతో కూడిన ఈ కొత్త ఏడు బృందాలు తక్షణ, దీర్ఘకాల చర్యలను అమలు చేస్తాయని తెలిపారు. వీటి ద్వారా ప్రస్తుత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రత్యేక స్వభావం కలిగిందని, అందుకు అనుగుణంగా పరిష్కారాలు రూపొందిస్తున్నామని చెప్పారు. సహనం, శాంతం, నియంత్రణతో ప్రతి సవాల్‌ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
పేదలు, కార్మికులపై ప్రభావం
రాబోయే కాలం దేశానికి పెద్ద పరీక్షగా మారుతుందని, దీనిని విజయవంతంగా ఎదుర్కొవడంలో రాష్ట్రాల సహకారం కీలకమని మోడీ అన్నారు. ముఖ్యంగా పేదలు, కార్మికులు, వలస కార్మికులు ప్రభావితమవుతారని సూచిస్తూ, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ప్రయోజనాలు సమయానికి అందేలా చూడాలని రాష్ట్రాలకు సూచించారు. అవసర వస్తువుల సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కోవిడ్ సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేసిన టీమ్ ఇండియా స్ఫూర్తిని గుర్తుచేస్తూ, అదే భావనతో ఇప్పుడు కూడా ముందుకు సాగాలని అన్నారు. ఈ యుద్ధ ప్రభావాలు దీర్ఘకాలం కొనసాగవచ్చని హెచ్చరిస్తూ, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రతి నిర్ణయం ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తీసుకుంటోందని తెలిపారు. దేశ ప్రజల సంక్షేమమే మా ప్రాధాన్యం అని స్పష్టం చేశారు.
పశ్చిమాసియా సంక్షోభం కొనసాగితే తీవ్ర ప్రభావాలు తప్పవని పేర్కొంటూ, సముద్ర మార్గాల్లో భారత నౌకల సురక్షిత ప్రయాణం కోసం రాజనీతితో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హోర్ముజ్ జలసంధి తెరవాలని, యుద్ధం తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. వాణిజ్య నౌకలపై దాడులు, అంతర్జాతీయ జల మార్గాల అడ్డంకులు అంగీకరించలేమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
