
రాబిన్ ఉత్పా, కార్తీక్ ఇన్నింగ్స్‌తో భారత్ పాక్‌ను చిత్తు
టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన హాంకాంగ్ సిక్సెస్ 2025లో వర్షం అడ్డుకున్నా భారత్ పాకిస్తాన్‌పై రెండు రన్స్ తేడాతో గెలిచి పూల్ సీలో ఆధిపత్యం చూపింది. డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ (డీఎల్‌ఎస్) పద్ధతి ఆధారంగా ఫలితం నిర్ణయమైంది.
వర్షం కారణంగా కుదించిన మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు ఓవర్లలో 86/4 సాధించింది. రాబిన్ ఉత్పా 11 బంతుల్లో 28, భరత్ చిప్లీ 13 బంతుల్లో 24 రన్స్ సాధించగా, కెప్టెన్ దినేష్ కార్తీక్ ఆరు బంతుల్లో 17తో జట్టును ఆదుకున్నాడు. హాంకాంగ్ సిక్సెస్ ప్రకటన ప్రకారం, పాకిస్తాన్ ఛేజ్ మూడు ఓవర్లలో 41/1కి చేరిన సమయంలో భారీ వర్షం కారణంగా ఆట ఆపివేయబడింది. డీఎల్‌ఎస్ లెక్కల్లో పాక్ రెండు రన్స్ వెనుకబడి ఓడింది. స్టూవర్ట్ బిన్నీ ఏడు రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసి కీలక పాత్ర పోషించాడు.
పూల్ బీలో ఆస్ట్రేలియా యూఏఈపై 10 వికెట్ల తేడాతో సులువుగా గెలిచింది. 88 రన్స్ టార్గెట్‌ను మూడు ఓవర్లలోనే ఛేదించింది. జాక్ వుడ్ 11 బంతుల్లో 55 పరుగులు, నిక్ హాబ్సన్ ఐదు బంతుల్లో 26 పరుగులతో అదరగొట్టారు.
పూల్ ఎలో అఫ్గానిస్తాన్ దక్షిణాఫ్రికాపై 49 పరుగుల తేడాతో రెండో విజయం సాధించింది. కెప్టెన్ గుల్బదిన్ నాయబ్ 12 బంతుల్లో 50 పరుగులు, కరీమ్ జనత్ 11 బంతుల్లో 46 పరుగులతో ఆరు ఓవర్లలో 148/2 పోస్టు చేశారు. ఛేజ్‌లో దక్షిణాఫ్రికా 99/2కే పరిమితమైంది.
పూల్ డీలో బంగ్లాదేశ్ శ్రీలంకపై 14 రన్స్ తేడాతో గెలిచింది. కెప్టెన్ అక్బర్ అలీ 9 బంతుల్లో 32 పరుగులు సాధించగా, మొసడ్డెక్ హొస్సైన్ 3/20తో శ్రీలంకను 61/6కే కట్టడి చేశాడు. శ్రీలంకకు ఇది రెండో వరుస ఓటమి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
