Let's talk: editor@tmv.in
రాప్తాడు ప్రజల నీటి కష్టాలు తీర్చండి: పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే విన్నపం

రాప్తాడు ప్రజల నీటి కష్టాలు తీర్చండి: పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే విన్నపం

Panthagani Anusha
25 ఫిబ్రవరి, 2026

రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని తాగునీటి ఎద్దడిని నివారించాలని, తాగునీటి పథకాలను పునరుద్ధరించాలని కోరుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం అసెంబ్లీలోని కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఆయనకు వివరించి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే విన్నపంపై సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్ తక్షణమే రహదారుల మరమ్మతుల కోసం రూ. 11.50 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

వినతిపత్రంలోని వివరాల ప్రకారం అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాల్లోని 52 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న సత్యసాయి నీటి పథకం నిర్మించి 30 ఏళ్లు కావస్తోందని దీనివల్ల తరచూ పైపులైన్లు పగిలి నీటి సరఫరాకు ఆటంకం కలుగుతోందని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పథకం ఆధునీకరణకు రూ. 50 కోట్లు కేటాయించాలని కోరారు. అదేవిదంగా సరైన నీటి వసతి లేని అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల్లోని మరో 38 గ్రామాల కోసం రూ. 55 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు.

అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోకి వచ్చే రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లోని అన్ని గ్రామాలకు గొల్లపల్లి రిజర్వాయర్ నుండి నూతన సిపిడబ్ల్యుఎస్ పథకం ద్వారా తాగునీరు అందించేందుకు రూ. 180 కోట్లు అవసరమని ఎమ్మెల్యే వివరించారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని అత్యవసర నీటి సరఫరా పనులను చేపట్టాలని కోరగా ఉపముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో రామగిరి కనగానపల్లి, సి.కె.పల్లి, రాప్తాడు ఆత్మకూరు మండలాల్లోని గ్రామాల్లో రహదారులు దయనీయ స్థితిలో ఉన్నాయని ఎమ్మెల్యే వివరించగా . దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం రోడ్డు పనుల నిమిత్తం రూ. 11.50 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.