Let's talk: editor@tmv.in
రానున్న బడ్జెట్‌లో సాగునీరు, మౌలిక సదుపాయాలకు పెద్దపీట: మంత్రుల ముందస్తు సమీక్ష

రానున్న బడ్జెట్‌లో సాగునీరు, మౌలిక సదుపాయాలకు పెద్దపీట: మంత్రుల ముందస్తు సమీక్ష

Dantu Vijaya Lakshmi Prasanna
5 ఫిబ్రవరి, 2026

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, సచివాలయంలో పలు కీలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో వరుసగా 'ప్రీ-బడ్జెట్' సమావేశాలు నిర్వహించారు.

జలవనరుల శాఖపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో రైతన్నలకు భరోసా కల్పించడమే ధ్యేయంగా, సకాలంలో పంట పొలాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన నిధుల కేటాయింపులపై ఆర్థిక మంత్రి, జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడుతో సుదీర్ఘంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, కాల్వల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్, సెక్రటరీ, జలవనరుల శాఖ అడ్వైజర్, తదితరులు పాల్గొన్నారు.

మౌలిక సదుపాయాలు, ఆర్ అండ్ బీ కేటాయింపులపై చర్చ

అనంతరం రోడ్లు, భవనాలు(ఆర్&బి) పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖలపై మంత్రి శ్రీ బీసీ జనార్థన్ రెడ్డితో కలిసి ఆర్థిక మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి, పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన బడ్జెట్ అంచనాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, కొత్త ప్రాజెక్టులకు నిధుల లభ్యత. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్, ఏపీ ఏడీసీఎల్ వంటి సంస్థల పురోగతికి మద్దతు గురించి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం.టి. కృష్ణబాబు, ఏపీ ఏడీసీఎల్ ఎండీ, ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఎండీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హోం మంత్రితో శాంతి భద్రతలకు నిధుల కేటాయింపుపై చర్చలు

2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ముందస్తుగా బడ్జెట్ కూర్పుపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ , హోం మంత్రి వంగలపూడి అనిత అమరావతి సచివాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకై హోం శాఖను మరింత పటిష్టంగా నిర్వహించడానికి అవసరమైన నిధుల కేటాయింపులపై ఇరువురు మంత్రులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ఈ సమావేశంలో ఆర్థిక శాఖసెక్రటరీలు వినయ్ కుమార్,రోనాల్డ్ రాస్, జాయింట్ సెక్రటరీ, హోమ్ శాఖ సెక్రటరీ, అడిషనల్ డీజీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మొత్తానికి, అభివృద్ధి, సంక్షేమ రంగాల మధ్య సమతుల్యత పాటిస్తూ 2026-27 బడ్జెట్‌ను రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.