
రానున్న ఎన్నికల్లో రెండు పార్టీల మధ్యే పోటీ: టీవీకే విజయ్
తమిళనాడు శాసనసభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనేక నిందారోపణలు చేశారని, ద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ తమిళ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ బుధవారం ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. మహాబలిపురంలో జరిగిన పార్టీ ప్రత్యేక సాధారణ సమావేశంలో ఆయన ఘాటుగా ప్రసంగించారు. మేం ఇన్ని రోజులుగా తీవ్ర బాధలో, దుఃఖంలో ఉన్నాం. వర్ణించలేని బాధను అనుభవించాం. మన సొంత ప్రజల హృదయాలకు అండగా నిలబడటం మా కర్తవ్యం. అందుకే మేం ఈ సమయమంలో మౌనంగా ఉండాలని భావించాం. కానీ మేం ప్రశాంతంగా, మౌనంగా ఉన్న సమయంలో మాపై ద్వేషం , నిరాధారమైన అపవాదులు సృష్టించారని ఆరోపించారు. అబద్ధపు ప్రచారం చేశారు. ఇప్పుడు వాటిని చట్టబద్ధంగా, సత్యబలంతో తుడిచిపెట్టబోతున్నాం అని విజయ్ అన్నారు.
ముఖ్యమంత్రిపై ఆరోపణలు
రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పుకునే సీఎం, అసెంబ్లీలోనే మా గురించి తప్పుడు ఆరోపణలు దూషించేలా వ్యాఖ్యలు చేశారు. మాటల్లో పెద్ద మనసు చూపుతూ, చర్యల్లో విషం చిమ్ముతున్నారు. తమిళ ప్రజలు ఈ ద్వంద్వ వైఖరిని గుర్తించరని ఆయన అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. భారతదేశంలో మరే నేతకీ ఎదురుకాని ఆంక్షలు మాపై విధించారు. బస్సు మీద నిలబడి ప్రజలకు చేయి ఊపకూడదు, లోపలే ఉండాలి, ఇలా ఎన్నో పరిమితులు పెట్టారని విజయ్ ఆరోపించారు.
కరూర్ ఘటనపై వ్యాఖ్యలు
కరూర్ ఘటన తరువాత ప్రభుత్వం ఏక వ్యక్తితో విచారణ కమిషన్ నియమించినా, తర్వాత ప్రభుత్వం అధికారులను, పోలీసులను మీడియా ముందు నిలబెట్టిందని, దీంతో ఆ కమిషన్ గౌరవం దెబ్బతిందని అన్నారు. పోలీసు అధికారులు మీడియా ముందు చేసిన ప్రకటనలు న్యాయమైన దర్యాప్తు జరుగుతుందా? లేదా అనే దానిపై ప్రజల్లో సందేహాన్ని కలిగించాయని, పారదర్శకమైన, న్యాయమైన దర్యాప్తు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించగలదని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిందని ఆయన గుర్తు చేశారు.
డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
అధికార మదంలో మునిగిపోయిన ముఖ్యమంత్రి, మానవత్వం, నీతి, గౌరవం అన్నింటినీ పక్కనబెట్టి కేవలం రాజకీయ ఆటలాడుతున్నారని విజయ్ ధ్వజమెత్తారు. ప్రజలు ఈ ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారు. 2026 ఎన్నికల్లో ప్రజల ఇచ్చే తీర్పుతో డీఎంకేకు గట్టి దెబ్బ పడుతుందని అని హెచ్చరించారు. 2026లో పోటీ టీవీకే, డీఎంకే ఈ రెండు పార్టీల మధ్యే ఉంటుంది. ఈ పోరాటం మరింత బలపడుతుంది. విజయం 100 శాతం మాదే. చరిత్ర సృష్టించబోతున్నాం. మంచి రోజులు రాబోతున్నాయి అంటూ విజయ్ తన ప్రసంగాన్ని ముగించారు.
