
రానున్నమూడు నెలలు అధిక ఉష్ణోగ్రతలు…ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి
రానున్న మూడు నెలల కాలంలో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రం కానున్నాయని, ప్రజలు వడగాల్పుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి సూచించారు. ఈ మేరకు ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో వేసవి సన్నద్ధతపై ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తుల నిర్వహణ శాఖతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించి ప్రజలకు ఎండ తీవ్రతపై ముందస్తు సమాచారం అందించాలని ఆదేశించారు.
అదేవిధంగా వేసవి తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ కూలీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జయలక్ష్మి స్పష్టం చేశారు. ఎండలు ముదరక ముందే అంటే ఉదయం 11 గంటల లోపు పనులు ముగించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పని ప్రదేశాల్లో తాగునీరు, మజ్జిగ, నీడ కోసం టెంట్లు ప్రథమ చికిత్స కిట్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. అదేవిధంగా ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర తాగునీటి సరఫరా విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్‌కో అధికారులకు ఆదేశించారు.
కేవలం మనుషులకే కాకుండా పశువులకు కూడా ఎండల వల్ల ముప్పు పొంచి ఉందని స్పెషల్ సీఎస్ గుర్తుచేశారు. గ్రామాల్లోని నీటి తొట్టెలను ట్యాంకర్ల ద్వారా నిరంతరం నింపాలని పశుగ్రాసం విషయంలో రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖను ఆదేశించారు. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో ముఖ్యంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని కోరారు. బయటకు వెళ్లాల్సి వస్తే తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, శరీరం లవణాలను కోల్పోకుండా ఉప్పు కలిపిన ద్రవ పదార్థాలు, కొబ్బరి బొండాలు, మజ్జిగ వంటివి తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది మే వరకు వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వివరించారు. ఇప్పటికే ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎండ తీవ్రత అత్యవసర సహాయం కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 అందుబాటులో ఉన్నాయని ప్రజలు వీటిని వినియోగించుకోవాలని కోరారు. ఎప్పటికప్పుడు వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
