
రాధాకు పదవి రాదా ?
విజయవాడ రాజకీయాల్లో వంగవీటిది ప్రత్యేక స్థానం. తరాలు మారినా వంగవీటి రంగాది చెరగని ముద్ర. ఆయన వారసత్వం పుణికిపుచ్చుకున్నారు తనయుడు రాధాకృష్ణ. తండ్రిలా చరిత్ర సృష్టించకపోయినా.. చెడ్డపేరు తీసుకురాలేదు. కానీ రాజకీయంగా అడుగులు మాత్రం ఇప్పటికీ తడబడుతూనే ఉన్నాయి. రాధా రాజకీయ జీవితాన్ని పరిశీలించినప్పుడు కలిగే భావన ఇది. వంగవీటి రాధా అడుగులు తడబడుతూనే ఉంటాయా ?. నిలకడగా ప్రయాణం సాగదా అన్న చర్చ సాగుతోంది.
వంగవీటి రాధాకృష్ణ మొదటిసారి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. 2009 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. వంగవీటి రాధా తడబాటు ఇక్కడే మొదలైంది. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది. వంగవీటి రాధా 2012లో వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 2019లో టీడీపీలోకి చేరారు. అప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వలేదు. పార్టీ ప్రచారానికి మాత్రమే వాడుకుంది.
వంగవీటి రాధా వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ, టీడీపీలో చేరాక వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2004 తర్వాత ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. 2014 ఓటమి తర్వాత ఎన్నికలకు దూరమయ్యారు. ఇదంతా రాధా తడబాటు నిర్ణయాల వల్ల జరిగిన వ్యవహారంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, ఎమోషనల్ నిర్ణయాల వల్ల రాధా రాజకీయం గందరగోళంగా మారింది. తనకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను రాధా సద్వినియోగం చేసుకోలేకపోయారు. 2019 నుంచి టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ టీడీపీలో యాక్టివ్ గా లేరు. టీడీపీ నాయకుడిగా కంటే రంగా తనయుడిగా ఉన్న గుర్తింపునే రాధా ఇష్టపడుతున్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి వస్తుందని భావించారు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదు.
ఇటీవల రాధా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ సమావేశంలో అభిమానులు ప్రభుత్వ పదవులు రావాలంటూ ఆకాంక్షించారు. కానీ తనకు పదవులు అవసరం లేదని, రంగా తనయుడిగా ఉన్న గుర్తింపు, అభిమానుల ఆదరాభిమానాలు చాలంటూ రాధా మాట్లాడారు. రాధా మాటల ఆంతర్యం ఏంటి ?. ఎందుకలా మాట్లాడారు?. పదవులు రావని ఫిక్స్ అయ్యారా?. పార్టీ మారుతారా అంటూ పలు ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో సర్క్యులేట్ అవుతున్నాయి. టీడీపీ అధిష్టానం కూడా రాధా పట్ల ఆసక్తి చూపడంలేదన్న వాదన వినిపిస్తోంది. కాపు సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ఇన్నాళ్లు వంగవీటి రాధాను రాజకీయ పార్టీలు దగ్గర చేసుకునేవి. కానీ పవన్ కళ్యాణ్ వచ్చాక టీడీపీకి వంగవీటి రాధా అవసరం తగ్గింది. కాపుల్లో పవన్ కు ఉన్న క్రేజ్ టీడీపీకి చాలు. వంగవీటి రాధాతో ఇక పనిలేదు అనుకుందో.. ఏమో. వంగవీటి రాధాను పట్టించుకోవడం లేదన్న వాదన ఉంది.
టీడీపీ ఆలోచన అర్థమైన వంగవీటి రాధా.. పదవులు వద్దు అన్న మాట మాట్లాడారా అన్న చర్చ ఉంది. వైసీపీ ఇప్పటికే వంగవీటి రాధా కోసం ప్రయత్నిస్తోంది. టీడీపీకి పవన్ ఉన్నట్టే.. తమకు వంగవీటి ఉండాలనుకుంటోంది. కానీ రాధా వైసీపీలోకి మళ్లీ వెళ్తారా అన్నదే ప్రశ్న. రాధా స్నేహితులు కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీలో ఉన్నారు. ఈ ఇద్దరి ద్వారా వైసీపీ రాధా కోసం ప్రయత్నిస్తోంది. కానీ రాధా మాత్రం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదన్న వాదన ఉంది. టీడీపీ ప్రాధాన్యతను బట్టి రాధా అడుగులు ఉంటాయన్నది విశ్లేషకులు అంచనా. ఈసారైనా రాధా అడుగులు తడబడకుండా ఉంటాయా అన్నది ప్రశ్న.
