
రాత్రివేళ ఇళ్ల చోరీలు.. 26 కేసుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అరెస్ట్
పగలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా సాఫీగా సాగిపోతూ.. రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతర్ జిల్లా దొంగను విశాఖ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడకు చెందిన అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ (సన్నీ)గా గుర్తించిన ఈ నిందితుడు, విశాఖ నగర వ్యాప్తంగా సుమారు 26 ఇళ్లలో భారీ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడి నుంచి రూ.25 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు దొంగతనపు సొమ్ముతో విలాసాల కోసం కొనుగోలు చేసిన ఒక బీఎండబ్ల్యూ కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం డీసీపీ (క్రైమ్స్) కె.లతా మాధురి తెలిపిన వివరాల ప్రకారం సంక్రాంతి పండుగ అనంతరం విశాఖలోని గాజువాక, అరిలోవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడ పరిసర ప్రాంతాల్లో వరుసగా చోరీలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు పగటిపూట రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేయడం నిందితుడి మోడ్ ఆపరెండిగా గుర్తించారు. కాగా ఘటనా స్థలంలో వేలిముద్రలు పడకుండా ఎలాంటి సాంకేతిక ఆధారాలు దొరక్కుండా నిందితుడు అత్యంత జాగ్రత్తలు వహించినప్పటికీ, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాజువాకలో అతడిని అరెస్టు చేశారు.
ఈ చోరీల వ్యవహారం తొలిసారి 2025 అక్టోబర్ 14న గాజువాకకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. కుటుంబంతో బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాని ఆధారంగా గాజువాక పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 331(4), 305(ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఇదే తరహాలో జరిగిన మొత్తం 26 చోరీలతో నిందితుడికి సంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఇదిలా ఉండగా నిందితుడు మహేష్ రెడ్డికి చిన్నతనం నుంచే నేరచరిత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే కాకినాడలో జువైనైల్ జైలుకు వెళ్లిన ఇతనిపై అప్పట్లోనే డోసియర్ క్రిమినల్ షీట్ నమోదైంది. చదువు పూర్తి చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించినా విలాసవంతమైన జీవితంపై ఉన్న వ్యామోహంతో తిరిగి నేరాల బాట పట్టాడు. మొత్తం 26 కేసుల్లో సుమారు 1,080 గ్రాముల బంగారం, 6,333 గ్రాముల వెండిని అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై ఇప్పటికే రౌడీ షీట్ తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రస్తుతం అతడిని ఏడాది పాటు నివారణాత్మక నిర్బంధంలో ఉంచినట్లు డీసీపీ వెల్లడించారు.
అంతేకాకుండా ఈ నేరాల్లో నిందితుడి తల్లి పాత్రపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాలకు వాడిన ద్విచక్ర వాహనం యజమానికి ఈ నేరాలతో సంబంధం లేదని తేల్చిన పోలీసులు, నిందితుడి కుటుంబ నేపథ్యంపై పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం,వెండిని త్వరలోనే బాధితులకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
