
రాణిగంజ్ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన: మంత్రి పొన్నం
నగరంలో ప్రజా రవాణా సేవలను ఆధునికీకరించడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో కొత్తగా 65 ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై బస్సులను ప్రారంభించారు. ఆమెతో పాటు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సుచరీత, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, పలువురు నేతలు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో పర్యావరణ హిత రవాణా వ్యవస్థను విస్తరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్యం లేని, శబ్దరహిత రవాణాకు మార్గం సుగమం చేస్తాయని పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంలో ఈ కొత్త వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహా లక్ష్మీ ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమై, ఇప్పుడు విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఈ రెండు ఏళ్లలో మహిళలు పథకానికి విశేష స్పందన చూపారని, ఇప్పటివరకు 251 కోట్ల ప్రయాణాలు ఉచితంగా చేసినట్లు తెలిపారు. ఈ సేవల విలువ దాదాపు రూ. 8,500 కోట్లకు చేరిందన్నారు.ఉచిత ప్రయాణం కారణంగా దేవాదాయ శాఖకు వెళ్లే ఆదాయం కూడా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చే రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
గత రెండు సంవత్సరాల్లో ఆర్టీసీనీ బలోపేతం చేయడానికి భారీగా చర్యలు తీసుకున్నామని, మొత్తం బస్సులలో 40 శాతం కొత్త బస్సులను కొనుగోలు చేసి సేవల్లోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఆధునిక వసతులు, శుభ్రత, భద్రతపై దృష్టి పెట్టి, ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
జంట నగరాల పరిధిలో ఇప్పటికే 300 బస్సులు తిరుగుతున్నాయి. ఇవ్వాళ మరో 65 ఈవీ బస్సులు రోడ్డెక్కనున్నాయి.సికింద్రాబాద్ కొండాపూర్ మధ్య 14 బస్సులు, సికింద్రాబాద్ ఇస్నాపూర్ మధ్య 25 బస్సులు, సికింద్రాబాద్ బోరబండ రూట్ లో 8 బస్సులు, సికింద్రాబాద్ నుంచి రామయంపేట్ 6 బస్సులు, సికింద్రాబాద్ టు గచ్చిబౌలి ఎనిమిది బస్సులు, సికింద్రాబాద్ మియాపూర్ క్రాస్ రోడ్స్ వరకు 4 బస్సులు ప్రయాణికులకు
సేవలందించనున్నాయి.హైదరాబాద్‌లో వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇక్కడి డీజిల్ బస్సుల్ని జిల్లాలకు పంపించాలని ప్రణాళికలు రూపొందించింది.
