
రాజ్యాంగ సంస్థల మధ్య ప్రజాస్వామ్య సమతౌల్యం
రాజ్యాంగ సంస్థల హద్దులు, పరస్పర గౌరవం, సమతౌల్యం గురించి భారత ప్రజాస్వామ్యంలో మరోసారి ఒక కీలక చర్చకు తెర లేచింది . ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో గవర్నర్ లేదా రాష్ట్రపతికి కోర్టు స్పష్టమైన గడువు విధించలేదన్న అంశం ఈ చర్చను మరింత ఉధృతం చేసింది. ఈ సమయంలో ఒక కీలక ప్రశ్న: రాజ్యాంగం ఇచ్చిన స్వతంత్ర అధికారం ఎక్కడ ముగుస్తుంది? ప్రజాస్వామ్య బాధ్యత ఎక్కడ మొదలవుతుంది?
రాజ్యాంగ నిర్మాణం: శక్తుల సమతౌల్యం
భారత రాజ్యాంగం ఒక అద్భుతమైన సమతౌల్య నిర్మాణం. ఒక వైపు రాష్ట్రపతి, గవర్నరు అధికారిక, రాజ్యాంగాధారిత పదవులు. మరో వైపు ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధుల ఆధారిత చైతన్య వ్యవస్థ. మూడో వైపు న్యాయవ్యవస్థ నియంత్రణ, సమీక్ష మరియు సమతౌల్యం. రాజ్యాంగ రచయితలు దీన్ని “ప్రజాస్వామ్య నృత్యం”లా తీర్చిదిద్దారు.శక్తుల మధ్య సహకారం ఉండాలి, ఆధిపత్యం కాదు. ఫెడరలిజం ఉండాలి, కేంద్రీకరణ కాదు. నిర్దిష్ట బాధ్యత ఉండాలి, వ్యక్తిగత అభిరుచులు కాదు.
రాజ్యాంగ సంస్థలు మధ్య రాజ్యాంగంలోని ముఖ్యమైన సూత్రాలు
రూల్ ఆఫ్ లా – పరిపాలనా ఎవరి వ్యక్తిగత అభిప్రాయం ప్రకారమో కాదు, చట్టం ప్రకారం పరిపాలించాలి.
న్యాయ సమీక్ష – ఎవరి అధికారం కూడా అంతిమం కాదు, అపరిమితం కాదు.
స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం – రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమతుల్యత ఉండాలి, ఒకటి మరొకదానిపై పోటీ కాదు.
రాజ్యాంగ నైతికత – పదవులు వ్యక్తుల కోసం కాదు, వ్యవస్థ కోసం.
ఇవి అన్నీ సుప్రీంకోర్టు తీర్పుల ద్వారానే బలపడుతూ వచ్చాయి.
గవర్నర్ లేదా రాష్ట్రపతి చట్టసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా వుండటం గురించి ఇటీవలి తీర్పు:
గవర్నర్, రాష్ట్రపతికి వ్యావహారిక స్వతంత్రత ఉంది కోర్టు వారికి “ఇంతలో చేయాలి” అని గడువు విధించలేదు అని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు నిజమే. కానీ అదే సమయంలో సమస్య ఎక్కడ మొదలవుతుంది?ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్య యంత్రాంగం వేగాన్ని తగ్గిస్తే?పదవి నిర్వాహణ వ్యక్తిగత నిర్ణయాలుగా మారితే?అధికారిక నిర్ణయాలు ఆలస్యంగా తీసుకుంటే?
రాష్ట్ర ప్రభుత్వాలు నిలిచిపోయే పరిస్థితులు వస్తే?ఇవి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాద సూచికలు.
రాజకీయ-న్యాయ వ్యవస్థల మద్య సరిహద్దు: ఎవరు ఎవరి హద్దులు దాటుతున్నారు?
గత పది సంవత్సరాలలో గవర్నర్-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక ఘర్షణలు చూశాం బిల్లుల ఆమోదం ఆలస్యం చేయడం, మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాతికి నెట్టడం, శాసనసభ ప్రసంగాలను మార్చడం, ఫైళ్లపై నిరవధిక నిశ్శబ్ధం.ఇవి ఎక్కడికి తీసుకెళ్తున్నాయి. ఫలితం కోర్టులు జోక్యం చేసుకోవడం? రాష్ట్రాల అసంతృప్తి, కేంద్రం-రాష్ట్రాల సంబంధాలు ఉద్రిక్తత
రాజ్యాంగ నిర్మాతల ఆశయం:
డాక్టర్ అంబేద్కర్ తరచూ హెచ్చరించేవారు - “Institutions are only as good as the people who run them.”
అంటే రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా - దానిని అమలు చేసే వ్యక్తుల నైతికతే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది. గవర్నరు లేదా రాష్ట్రపతి రాజ్యాంగస్థానాలు, ఆవిధంగా నీతినిష్టతో, మధ్యవర్తిత్వం లేకుండా వ్యవహరించినప్పుడే వ్యవస్థ బలపడుతుంది.
కానీ రాజకీయమయం పెరిగితే?ప్రతి నిర్ణయం రాజకీయ హద్దులలో బంధింపబడితే?
అప్పుడు రాజ్యాంగం సూచించిన చల్లదనము, నిష్పాక్షికత కనిపించదు.
రూల్ ఆఫ్ లా* *vs రూల్ ఆఫ్ డిస్క్రిషన్
గవర్నరు, రాష్ట్రపతుల స్వతంత్రత వాస్తవంమే కానీ అది “జవాబుదారీతనం లేని స్వేచ్ఛ” అయితే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది.
రూల్ ఆఫ్ లా
అంటే - అధికారాల కంటే బాధ్యతలు ముందుంటాయి. అదే రాజ్యాంగ సారం.
న్యాయ సమీక్ష* *–* *చివరి అడ్డుకట్ట
న్యాయవ్యవస్థ భారత ప్రజాస్వామ్యానికి “సైలెంట్ గార్డ్”.ఎగ్జిక్యూటివ్ లేదా రాజ్య సంస్థలు హద్దులు దాటితే కోర్టులు కట్టడి చేస్తాయి.చట్టం మీకంటే పెద్దది అని గుర్తు చేస్తాయి.
ఫెడరలిజం: కేంద్ర-రాష్ట్రాల సమతౌల్యం దెబ్బతింటున్నదా
ఇటీవలి వాతావరణం చూస్తే
కేంద్రం vs రాష్ట్రాలు
గవర్నర్ vs ప్రభుత్వం
శాసనసభ vs గవర్నర్
అని కొత్త పోరులుగా తయారవుతున్నాయి.ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.భారతదేశం “యూనియన్ ఆఫ్ స్టేట్స్” అనేది కేవలం లైన్ కాదు.రాజ్యాలకు గౌరవం ఇవ్వండి అన్న స్పష్టమైన విధానం.
ప్రజలు చూడాలనుకుంటున్నది: తటస్థత,వేగమైన నిర్ణయాలు,వ్యవస్థలు కలిసి నడవడం,పరస్పర గౌరవం,రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడం. కానీ ఈ రోజు చూస్తున్నది
అనవసర ఆలస్యం, వాగ్వాదాలు, ప్రతిష్టాత్మక ప్రకటనలు. గత 75 ఏళ్లలో నిర్మించబడిన బలమైన న్యాయసూత్రాలు
ఈ దేశంలో - గోలక్ నాథ్ కేసు,కేశవానంద భారతి కేసు,ఎస్.ఆర్. బొమ్మ కేసు, నాబం రెబియా కేసు,షంషేర్ సింగ్ కేసు, రామేశ్వరప్రసాద్ కేసు మొదలైనవన్నీ ఒకే సందేశం చెబుతున్నాయి - పదవులు రాజ్యాంగం కోసం, ప్రజాస్వామ్యం కోసం. రాజకీయాల కోసం కాదు.ఇవే భారత ప్రజాస్వామ్యాన్ని ఇప్పటి వరకు నిలబెట్టిన స్తంభాలు.
పరిష్కారం:
• వ్యవస్థలను పరస్పర శత్రువులుగా కాక, భాగస్వాముల్లా చూడాలి
• గవర్నరు–ప్రభుత్వం పరస్పర గౌరవంతో వ్యవహరించాలి
• రాష్ట్రపతి–ప్రధాని రాజ్యాంగ చట్రంలో నడవాలి
• న్యాయవ్యవస్థ–మిగతా సంస్థలకు హద్దులు గుర్తు చేయాలి
• కేంద్రం–రాష్ట్రాలు పోటీదార్లు కాక, భాగస్వాములు కావాలి
• ప్రజాస్వామ్యం అంటే పోరు కాదు - సమన్వయం, సహకారం, బాధ్యత.
• చివరి మాట: రాజ్యాంగం జీవం లేని పుస్తకం కాదు - అది చైతన్య యంత్రాంగం
సుప్రీంకోర్టు చెప్పినట్లే “పదవులకు గౌరవం ఉంది, కానీ ప్రజాస్వామ్యానికి ఉన్న గౌరవం ఇంకా ఎక్కువ.”ఇది మనం ఎప్పుడు మర్చిపోవద్దు.
