Let's talk: editor@tmv.in
రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేస్తాం: రాహుల్ గాంధీ

రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేస్తాం: రాహుల్ గాంధీ

Pinjari Chand
29 డిసెంబర్, 2025

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన దినోత్సవం సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సత్యం, ధైర్యం, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం మరింత బలంగా పోరాడతామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో హిందీలో చేసిన పోస్టులో మాట్లాడుతూ, ఈ రోజు భారత జాతీయ కాంగ్రెస్ ఫౌండేషన్ డే సందర్భంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు హృదయపూర్వక శుభాకాంక్షలని తెలిపారు.

అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను వివరిస్తూ కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు. ఇది భారత ఆత్మ స్వరం. ప్రతి బలహీన వర్గం, నిరుపేదలు, కష్టపడే ప్రజల పక్షాన నిలబడిన పార్టీ కాంగ్రెస్. ద్వేషం, అన్యాయం, నియంతృత్వానికి వ్యతిరేకంగా సత్యం, ధైర్యం, రాజ్యాంగ రక్షణ కోసం పోరాటాన్ని మరింత బలంగా కొనసాగించడమే మా సంకల్పమని పేర్కొన్నారు.

స్వాతంత్ర్య పోరాట వారసత్వానికి నివాళి

భారత స్వాతంత్ర్య సమరంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన కీలక పాత్రను రాహుల్ గాంధీ గుర్తు చేస్తూ భారతదేశానికి స్వేచ్ఛను సాధించిన, రాజ్యాంగానికి పునాది వేసిన, ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి విలువలను బలోపేతం చేసిన మహానీయుల త్యాగాలకు మేం శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ ఫౌండేషన్ డే సందర్భంగా ప్రతి కాంగ్రెస్ సభ్యుడికి హృదయపూర్వక అభినందనలని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

బీజేపీపై పరోక్ష విమర్శ

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేసింది. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్. దేశ అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ కూడా . కానీ నేడు అధికారంలో ఉన్నవారు దేశంలో ద్వేషం, అన్యాయం, అణచివేతను ప్రోత్సహిస్తున్న సమయంలో, వాటికి వ్యతిరేకంగా మేం ఇప్పటికీ పూర్తి శక్తితో పోరాడుతున్నామని కాంగ్రెస్ తన సందేశంలో పేర్కొంది.

కాంగ్రెస్ పార్టీ స్థాపన చరిత్ర

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 28, 1885లో ముంబయి (అప్పటి బొంబాయి)లో స్థాపించారు. దాస్ తేజ్‌పాల్ సంస్కృత కాలేజ్లో జరిగిన సమావేశంలో 72 మంది ప్రతినిధుల సమక్షంలో ఈ పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ స్థాపకుడు, మొదటి జనరల్ సెక్రటరీగా ఏ.ఓ. హ్యూమ్ వ్యవహరించగా, ఉమేష్ చంద్ర బెనర్జీ తొలి అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ప్రజల హక్కులను లాక్కుంటున్నారు: ఖర్గే

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీపై తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. ప్రజల హక్కులను అణిచివేస్తూ, కాంగ్రెస్ నిర్మించిన వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వం ప్రజల హక్కులను విస్తరించింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే సమాచార హక్కు (ఆర్టీఐ), విద్యా హక్కు (ఆర్టీఈ), ఆహార భద్రత చట్టం, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ, అటవీ హక్కుల చట్టం, భూ సేకరణ చట్టం వంటి కీలక చట్టాలు అమలులోకి వచ్చాయని గుర్తు చేశారు. 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య సంస్థలను దెబ్బతీసిందని ఖర్గే ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ నేతలకు జాతీయ జెండా, రాజ్యాంగం, అశోక చక్రం, వందేమాతరం పట్ల గౌరవం లేదు. వారికి స్వాతంత్ర్య ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదు. అలాంటి వారు నేడు ప్రజల హక్కులను లాక్కుంటున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేస్తాం: రాహుల్ గాంధీ - Tholi Paluku