
రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రక బాధ్యత దేశంలోని ప్రజలందరిపై ఉందని ఆయన ఉద్ఘాటించారు.'ఓట్ చోర్ - గద్దీ ఛోడ్' (ఓటు దొంగ – గద్దె దిగిపో) పేరుతో న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్వహించిన ఈ భారీ ధర్నాకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఈ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ వంటి మహానుభావులు ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించారని తెలంగాణ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడాలని ఆయన పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి మూలాధారం అయిన ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానిదేనని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్‌ను తన చెప్పుచేతల్లో పెట్టుకొని ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజల ఓట్లను అక్రమంగా తొలగించడం, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడం ప్రజాస్వామ్యంలో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ 400 సీట్లు సాధిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని కుట్ర పన్నిందని ఆయన అన్నారు. అయితే ఈ ప్రమాదాన్ని గమనించిన దేశ ప్రజలు బీజేపీని 240 సీట్లకే పరిమితం చేశారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యంపై భారత ప్రజలకు ఉన్న అవగాహనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు చెందిన కోట్లాది మంది ఓట్లను ఎన్నికల కమిషన్ సహాయంతో తొలగించే ప్రయత్నం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పేదలు, అణగారిన వర్గాల రాజకీయ హక్కులను కాలరాసే చర్యగా అభివర్ణించారు. ఈ ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాటం సాగిస్తోందని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును, ప్రజల స్వేచ్ఛను కాపాడేందుకు చివరి వరకు నిలబడతామని రేవంత్ రెడ్డి తెలిపారు.
