
రాజ్యాంగాన్నే సవరించారు.. బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటి ? సీఎం
రాష్ట్ర పరిపాలనలో సమగ్ర సంస్కరణలకు ఇది అత్యంత కీలక దశ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, విభాగాధిపతులతో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు వేగంగా, పారదర్శకంగా సేవలు అందించాలంటే పాతబడిన బిజినెస్ రూల్స్‌ను తప్పనిసరిగా మార్చాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “దేశ రాజ్యాంగాన్ని కాలానుగుణంగా ఎన్నో సార్లు సవరించడం జరిగింది . అప్పుడు ప్రజల ప్రయోజనం కోసం ప్రభుత్వ వ్యాపార నియమాలను మార్చడంలో తప్పేంటి సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాలు, ఫైల్ ప్రక్రియలు, శాఖల మధ్య సమన్వయం ఇవన్నీ కొత్త కాలానికి సరిపోయేలా మారాలని అన్నారు.
అయితే ప్రస్తుతం ఒక చిన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా అనవసరంగా అనేక దశల్లో తిరగడం వల్ల ప్రజలకు సేవలు ఆలస్యమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డూప్లికేట్ సంతకాలు, అనవసర అనుమతులు, బహుళ శాఖల క్లియరెన్స్ వంటి ఆటంకాలు తొలగించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.అవసరం లేని నియమాలను రద్దు చేయాలని, పరిపాలనను సులభతరం చేయడానికి సమగ్ర చేంజ్ మేనేజ్‌మెంట్‌ను అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ప్రతి ఫైల్‌కు గడువు తప్పనిసరి
"పనితీరు లేకపోవడం, ఫైళ్ల నిలిపివేత, నిర్ణయాల ఆలస్యం ఇవన్నీ ఇకపై సహించబోమని ముఖ్యమంత్రి తీవ్రంగా హెచ్చరించారు. ప్రతి ఫైల్‌కు తప్పనిసరిగా ఒక నిర్దిష్ట గడువు నిర్ణయించాలని, ఆ గడువులోపు నిర్ణయం తీసుకోవడం సంబంధిత అధికారుల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
సాంకేతికత, డేటాలేక్ ఆధారంగా సమర్థవంతమైన పరిపాలనను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి శాఖ తమ అంతర్గత ఆడిట్ నిర్వహించాలని, ఏ నియమాలు పనికిరావు? ఏ ప్రక్రియలు ఆలస్యానికి కారణం? ఏ శాఖలో పనితీరు తగ్గింది? అన్న విషయాలను స్పష్టంగా గుర్తించి అందుకు అనుగుణంగా రూల్స్ చేంజ్ చెయ్యాలి అని అధికారులను ఆదేశించారు.
ప్రతిశాఖ పనితీరు ఏ విధంగా ఉందో ప్రభుత్వం వద్ద పూర్తిస్థాయిలో సమాచారం అందుబాటులో ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ విజన్‌తో ప్రతి అధికారి పనిచేయాలని సీఎం సూచించారు.
టెక్నాలజీ ఆధారిత పరిపాలన, డేటాలేక్, అవేర్, వాట్సాప్ గవర్నెన్స్ కీలకం
అవేర్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ప్రస్తుతం 42 కీలక అంశాల్లో ప్రజలకు అవసరమైన సమాచారం అందుబాటులోకి రావడంతో సేవలలో పారదర్శకత పెరిగిందని సీఎం తెలిపారు. ప్రతి శాఖ శాటిలైట్ డేటాను వినియోగించి ప్రజల సమస్యలను గుర్తించి, వారికి మరింత సమర్థవంతంగా సేవలు అందించేలా టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించాలని సూచించారు. పౌరసేవల, సమస్యల పరిష్కారానికి వాట్సాప్ గవర్నెన్స్ ముఖ్యపాత్ర పోషిస్తోందని, ఇప్పటికే 800కి పైగా సేవలు అందుబాటులో ఉండగా త్వరలో మరో 383 సేవలను జతచేయడం ద్వారా మొత్తం 1,200 సేవలు వాట్సాప్ ద్వారా అందే అవకాశం ఉంటుందని వెల్లడించారు. అదేవిదంగా ఇ–ఫైల్ వ్యవస్థను వేగవంతం చేసి, ప్రత్యేకంగా న్యాయశాఖలో పెండింగ్ కేసుల పరిష్కారంలో టెక్నాలజీ వాడకాన్ని మరింత పెంచాలని ఆయన సూచించారు.
జనవరి 15 డెడ్‌లైన్—పూర్తి ఆన్‌లైన్ పరిపాలన లక్ష్యం
జనవరి 15 నాటికి రాష్ట్రంలోని అన్ని శాఖలు ఆన్‌లైన్‌లో ఫైల్ డిస్పోజల్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోకపోతే సంబంధిత శాఖ మంత్రులు, అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచడానికి ఉద్యోగుల సామర్థ్యాలను పెంపొందించడంలో శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా సూచించారు.
