
రాజ్యాంగాన్ని కాపాడేందుకే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం: గౌరవ్ గోగోయ్
లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైన సందర్భంగా సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ గోగోయ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు పై విమర్శలు గుప్పించగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రతిపక్షంపై తీవ్రంగా స్పందించారు. దీంతోపాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌గోగోయ్, సభ నిర్వహణలో ఆయన పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని, పార్లమెంట్ గౌరవాన్ని కాపాడేందుకే స్పీకర్‌ను పదవి నుంచి తొలగించాలనే తీర్మానాన్ని ప్రతిపక్షం తీసుకువచ్చిందని తెలిపారు. మంగళవారం లోక్‌సభలో స్పీకర్‌ను తొలగించే తీర్మానంపై చర్చను ప్రారంభించిన గోగోయ్ మాట్లాడుతూ, ప్రతిపక్ష మహిళా ఎంపీలపై స్పీకర్ ఆధారంలేని ఆరోపణలు చేశారని విమర్శించారు. అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి కీలక అంశాలను సభలో ప్రస్తావించే అవకాశం ఇవ్వలేదని అన్నారు.
ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా జరిగిన ఘటనలను ఆయన ప్రస్తావించారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా పలుమార్లు అడ్డుకున్నారని పేర్కొన్నారు. స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని ఆశించాం. కానీ ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నప్పుడు పలుమార్లు అంతరాయం కలిగించారు. ఆయన నిలబడి మాట్లాడుతుండగానే మరో సభ్యుడిని పిలిచారు. ఇదేనా పార్లమెంటరీ సంప్రదాయం? అని ప్రశ్నించారు. సభలో మైక్‌లను ఉపయోగించి ఎంపీలను మౌనంగా ఉండేలా చేస్తున్నారని కూడా ఆరోపించారు. ఫిబ్రవరి 9న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన మైక్ ఆఫ్ చేసిన ఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రతిపక్షం తమ అభిప్రాయం చెప్పాలని అంటారు. కానీ మైక్ ఆఫ్ చేస్తే ఎలా మాట్లాడగలం? అని ఆయన ప్రశ్నించారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు స్పీకర్ పదవిని దేశ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా పేర్కొన్న విషయాన్ని గోగోయ్ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఎక్కడ ఉంది? అని ఆయన ప్రశ్నించారు.
మహిళా ఎంపీలు దాడి చేస్తారని ఎలా చెప్పారు?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడాల్సిన రోజున సభకు రాకూడదని స్పీకర్ సూచించారని ఆరోపించారు. ప్రతిపక్ష మహిళా ఎంపీలు ప్రధానమంత్రిని చుట్టుముట్టే అవకాశం ఉందని సమాచారం ఉందని స్పీకర్ చెప్పారని ఆయన అన్నారు. ఇది తటస్థతకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రతిపక్ష మహిళా ఎంపీలపై చేసిన ఆరోపణలు పూర్తిగా ఆధారంలేనివని గోగోయ్ విమర్శించారు. సభలో మహిళా ఎంపీల పట్ల పితృస్వామ్య ధోరణి కనిపిస్తోందని కూడా ఆయన అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత వ్యాఖ్యలను తరచూ రికార్డు నుంచి తొలగిస్తారని, అయితే అధికార పక్ష సభ్యులు మాజీ ప్రధానమంత్రులపై చేసిన ఆరోపణలు మాత్రం అలాగే ఉండిపోతాయని ఆరోపించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడే సమయంలో 20 సార్లు అంతరాయం కలిగించారని ఆయన చెప్పారు. ఇది ముందే ప్రణాళిక ప్రకారం జరిగిందని కూడా ఆరోపించారు. రాహుల్ గాంధీ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించాలని భావించారని గోగోయ్ చెప్పారు. వాటిలో మాజీ సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవణే తన విడుదల కాని పుస్తకంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమయంలో సభాపీఠంపై ఉన్న జగదాంబిక పాల్ గోగోయ్‌ను తీర్మానానికి సంబంధించిన అంశాలకే పరిమితం కావాలని సూచించారు.
ఎక్కువసార్లు అడ్డుకున్నది రిజిజునే
అంతలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌రిజిజు జోక్యం చేసుకుని ఇది స్పీకర్‌పై చర్చ అని, ఇతర విషయాలను ప్రస్తావించవద్దని అన్నారు. లోక్‌సభలో మాట్లాడిన గోగోయ్, భవిష్యత్తులో పార్లమెంటరీ రికార్డులపై పరిశోధనలు జరిగితే ప్రతిపక్షాన్ని అత్యధికంగా అడ్డుకున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా రిజిజు గుర్తుండిపోతారని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందించిన అమిత్ షా మాట్లాడుతూ, రిజిజు ఎక్కువసార్లు అడ్డుకున్నాడనేది నిజమే. కానీ ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రతిపక్షాన్ని మేమెప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం సభ నియమాలను పాటించకపోవడం వల్లే ఇలాంటి జోక్యాలు అవసరమవుతున్నాయని ఆయన తెలిపారు.
స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలన్న తీర్మానం వ్యక్తిగతంగా ఆయనపై కక్షతో తీసుకురాలేదని గోగోయ్ స్పష్టం చేశారు. సభ గౌరవాన్ని కాపాడే బాధ్యతతోనే ఈ తీర్మానాన్ని తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. ఈ అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జవాద్ సభలో ప్రవేశపెట్టారు. దీనికి 50 మందికి పైగా ఎంపీలు మద్దతు తెలపడంతో సభలో చర్చకు అనుమతి లభించింది. ఆ సమయంలో సభాపీఠంపై ఉన్న జగదాంబిక పాల్ చర్చకు 10 గంటల సమయం కేటాయించినట్లు తెలిపారు. స్పీకర్ సభ నిర్వహణలో పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపిస్తూ మొత్తం 118 మంది ప్రతిపక్ష ఎంపీలు ఈ తీర్మానంపై సంతకం చేశారు.
తర్వాత గోగోయ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ అమెరికాలో జరుగుతున్న ఒక వ్యాపారవేత్తపై దర్యాప్తు అంశాన్ని కూడా ప్రస్తావించాలని భావించారని అన్నారు. అలాగే యూరోపియన్ యూనియన్, అమెరికాతో జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలపై భారత్ తీసుకుంటున్న నిర్ణయాల గురించి కూడా మాట్లాడాలని ఆయన భావించారని చెప్పారు. అయితే ఈ అంశాలను ప్రస్తావించేందుకు ప్రతిపక్ష నేతకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. స్పీకర్‌ను వ్యక్తిగతంగా అందరు సభ్యులతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తిగా గౌరవిస్తామని, అయినప్పటికీ సభ గౌరవం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ తీర్మానాన్ని తీసుకురావాల్సి వచ్చిందని గోగోయ్ అన్నారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కాపాడటం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
