Let's talk: editor@tmv.in
రాజ్యాంగం పీఠిక నుంచి ‘సెక్యులర్’ ‘సోషలిస్ట్’ పదాలను తొలగించాలి: బీజేపీ

రాజ్యాంగం పీఠిక నుంచి ‘సెక్యులర్’ ‘సోషలిస్ట్’ పదాలను తొలగించాలి: బీజేపీ

Pinjari Chand
7 డిసెంబర్, 2025

భారత రాజ్యాంగ ప్రియాంబుల్​ (పీఠిక) నుంచి ‘సెక్యులర్’ (లౌకిక) ‘సోషలిస్ట్’ (సామ్యవాద) అనే రెండు పదాలను తొలగించాలని రాజ్యసభలో బీజేపీ ఎంపీ భీమ్ సింగ్ శుక్రవారం ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు “ది కాన్స్టిట్యూషన్ (అమెండ్మెంట్) బిల్, 2025 (అమెండ్మెంట్ ఆఫ్ ది ప్రియాంబుల్) అని పేరు పెట్టారు.

ఈ రెండు పదాలూ అవసరం లేదని అవి ఎమర్జెన్సీ సమయంలో అ నైతికంగా, అప్రజాస్వామికంగా చేర్చారని భీమ్ సింగ్ అన్నారు. 1949లో ఆమోదం పొందిన, 1950 నుంచి అమలులోకి వచ్చిన రాజ్యాంగంలో ఈ రెండు పదాలూ లేవు. 1976లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలను చేర్చారు. ఆ సమయంలో పార్లమెంటులో ఎలాంటి చర్చ జరగలేదు. అటల్ బిహారీ వాజపేయి, ఎల్.కె. అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్ వంటి ప్రతిపక్ష నేతలంతా జైల్లో ఉన్నారు. ప్రజాస్వామ్యాన్నే హత్య చేస్తున్న సమయంలో ఈ పదాలు చేర్చారు. కాబట్టి రాజ్యాంగం మూల రూపంలోనే ఉండాలని భీమ్ సింగ్ పీటీఐతో అన్నారు.

డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కూడా ఈ విషయంలో స్పష్టమైన అభిప్రాయం చెప్పారని ఆయన గుర్తు చేశారు. సెక్యులర్ అనే పదం అవసరం లేదని, రాజ్యాంగ నిర్మాణమే దేశాన్ని సెక్యులర్ గా అంబేద్కర్ చెప్పారు. ‘సోషలిస్ట్’ పదం విషయంలోనూ చర్చ జరిగింది. భవిష్యత్ తరాలపై ఒకే రాజకీయ, ఆర్థిక విధానాన్ని బలవంతంగా రుద్దలేమని అంబేడ్కర్ స్పష్టం చేశారని భీమ్ సింగ్ తెలిపారు. ఈ రెండు పదాలూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే, అప్పటి సోవియట్ యూనియన్‌ను సంతోషపెట్టడానికి ‘సోషలిస్ట్’, ముస్లిం సమాజాన్ని ఆకర్షించడానికి ‘సెక్యులర్’ పదాలు చేర్చారని ఆయన ఆరోపించారు.

1976కి ముందు భారతదేశం లౌకిక దేశం కాదా? నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీలు మతోన్మాద ప్రభుత్వాలు నడిపారా? అప్పుడు ఈ పదాలు ఎందుకు అవసరం లేదు? అని ఆయన ప్రశ్నించారు.

ప్రైవేట్ మెంబర్ బిల్లులు చాలా అరుదుగా ఆమోదం పొందుతాయన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఈ బిల్లు ఆమోదం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఈ అంశం ప్రభుత్వం, ప్రజల దృష్టికి వస్తుంది. అదే మా ఉద్దేశ్యం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కేవలం 14 ప్రైవేట్ మెంబర్ బిల్లులు మాత్రమే చట్టాలుగా మారాయి. 1970 తర్వాత ఒక్కటి కూడా రెండు సభల్లోనూ ఆమోదం పొందలేదు. ఈ బిల్లు ఆమోదం పొందితే రాజ్యాంగంలోని మిగతా నిబంధనలు, ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టంగా పేర్కొన్నారు.