Let's talk: editor@tmv.in
రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం

రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం

Shaik Mohammad Shaffee
11 ఏప్రిల్, 2026

బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగిసి, నూతన అధ్యాయం మొదలైంది. రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘ సేవలు అందించిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీయే కూటమిలో కీలక నేతగా, అపార రాజకీయ చతురత కలిగిన నితీశ్.. పార్లమెంటు ఎగువ సభకు ఎన్నికవ్వడం దేశ రాజకీయాల్లో పెను మార్పుగా భావిస్తున్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో లోక్‌సభ, అసెంబ్లీ, శాసనమండలి, ఇప్పుడు రాజ్యసభ.. ఇలా దేశంలోని నాలుగు చట్టసభల్లోనూ సభ్యుడిగా పనిచేయాలన్న తన చిరకాల కోరికను ఆయన ఈ సందర్భంగా నెరవేర్చుకున్నారు.

శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా

రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలో నితీశ్ కుమార్ తన బీహార్ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకే సమయంలో అటు పార్లమెంటులోనూ, ఇటు రాష్ట్ర శాసనసభ, మండలిలోనూ సభ్యుడిగా కొనసాగలేరు. ఈ క్రమంలో నితీశ్ తన రాజీనామా లేఖను ఎమ్మెల్సీ సంజయ్ గాంధీ ద్వారా మండలి చైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్‌కు సమర్పించారు. రాజ్యసభకు ఎన్నికైన 14 రోజుల్లోపు రాష్ట్ర సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలన్న నిబంధనను పాటిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఆర్టికల్ 101 ప్రకారం ఒక వ్యక్తి ఉభయ సభల్లోనూ సభ్యుడిగా ఉండకూడదు. ఒకవేళ ఎన్నికైతే రాష్ట్రపతి రూపొందించిన 'ప్రొహిబిషన్ ఆఫ్ సైమల్టేనియస్ మెంబర్‌షిప్ రూల్స్-1950' ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన 14 రోజుల్లోపు ఏదో ఒక సభ్యత్వానికి స్వస్తి పలకాలి. నితీశ్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 151ఏ ప్రకారం ఆరు నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, రాజ్యాంగపరంగా ఆయన మరో ఆరు నెలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంది.

బీజేపీ చేతికి రాష్ట్ర పగ్గాలు!

నితీశ్ కుమార్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడంతో బీహార్‌లో అధికార మార్పిడికి మార్గం సుగమమైంది. ఇప్పటివరకు జేడీయూ-బీజేపీ కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన నితీశ్ వైదొలగడంతో, ప్రభుత్వంపై పట్టు బీజేపీ చేతుల్లోకి వెళ్లనుంది. రాష్ట్రంలో తదుపరి నాయకత్వం, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు బీహార్ బీజేపీ అగ్రనాయకత్వం శుక్రవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. కొత్త ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ స్పష్టం చేశారు.

జేడీయూ అధ్యక్షుడిగా ఏకగ్రీవం

రాజ్యసభకు ఎన్నికైన వెంటనే నితీశ్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఆయన మినహా మరెవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో నితీశ్ ఏకగ్రీవమైనట్లు పార్టీ ప్రకటించింది. ఇదిలా ఉండగా మార్చి 16న నితీశ్‌తో పాటు ఎన్డీయే తరఫున మరో నలుగురు అభ్యర్థులు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో బలమైన ముద్ర వేసిన ఆయన, ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు.

అంచెలంచెలుగా ఎదిగిన రాజకీయ యోధుడు

1985లో ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన నితీశ్ కుమార్, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2005లో తొలిసారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు సృష్టించారు. సంక్లిష్టమైన కూటమి రాజకీయాలను సమర్థంగా నడుపుతూ 'సుశాసన్ బాబు'గా గుర్తింపు పొందారు. ఇప్పుడు తన చిరకాల వాంఛ అయిన రాజ్యసభ ప్రవేశంతో తన రాజకీయ జీవితంలో ఒక పరిపూర్ణతను సాధించారు. ఈ మార్పు బీహార్ భవిష్యత్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం - Tholi Paluku