Let's talk: editor@tmv.in
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Pinjari Chand
19 ఫిబ్రవరి, 2026

భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) రాజ్యసభ ద్వైవార్షిక (ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే) ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ 2026లో పదవీకాలం ముగియనున్న సభ్యుల స్థానాలను భర్తీ చేయడానికి 10 రాష్ట్రాల్లోని 37 సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎన్నికైన 37 మంది సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగియనుంది. దీంతో ఆయా స్థానాలు ఖాళీ కానున్నాయి.

ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 26న జారీ కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 5. నామినేషన్ల పరిశీలన మార్చి 6న జరుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను మార్చి 9 వరకు ఉపసంహరించుకోవచ్చు. మార్చి 16న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ మార్చి 20 నాటికి పూర్తవుతుందని ఈసీఐ వెల్లడించింది.

బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల ప్రాధాన్యతలను గుర్తించేందుకు రిటర్నింగ్ అధికారి అందించే నిర్దిష్ట ప్రమాణాలున్న సమగ్ర వైలెట్ రంగు స్కెచ్ పెన్నులనే ఉపయోగించాలని ఈసీఐ ఆదేశించింది. ఇతర పెన్నులను వినియోగించరాదని స్పష్టం చేసింది. ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా పరిశీలకులను నియమించి తగిన ఏర్పాట్లు చేయాలని కమిషన్ సూచించింది. ఇకపోతే, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు), ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీప్యాట్ ) యంత్రాల పనితీరుపై అవగాహన కల్పించేందుకు ఈసీఐ విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈసీఐ ప్రకటన ప్రకారం, ఐదు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఈవీఎం డెమోన్స్ట్రేషన్ కేంద్రాల్లో 1.20 లక్షలకుపైగా ఓటర్లు పాల్గొన్నారు. అందులో 1.16 లక్షలకుపైగా ఓటర్లు మాక్ పోలింగ్‌లో భాగమయ్యారు. ఫిబ్రవరి 10 నాటికి 29 వేలకుపైగా పోలింగ్ స్టేషన్ లొకేషన్లను మొబైల్ డెమో వాహనాల ద్వారా కవర్ చేసినట్లు కమిషన్ తెలిపింది.

ఏయే రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలున్నాయంటే

మహారాష్ట్రలో 7 స్థానాలు, తమిళనాడు – 6, బీహార్ – 5, పశ్చిమ బెంగాల్ – 5 స్థానాలు (ఇందులో ఒకటి జనవరి 5, 2026 నుంచి ఖాళీగా ఉంది) ఒడిశా – 4, అస్సాం – 3, ఛత్తీస్‌గఢ్ – 2, హర్యానా – 2, తెలంగాణ – 2, హిమాచల్ ప్రదేశ్ ఒక స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి.