Let's talk: editor@tmv.in
రాజ్యసభలో 19 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం

రాజ్యసభలో 19 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం

Pinjari Chand
7 ఏప్రిల్, 2026

పార్లమెంట్‌లో సోమవారం కొత్తగా ఎన్నికైన మొత్తం 19 మంది రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎగువ సభలో ప్రమాణ స్వీకార కార్యక్రమం సందడిగా మారింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి ఐదుగురు సభ్యులు ప్రమాణం చేశారు. వారిలో రాందాస్‌ అథవాలే , మాయా చింతామణి ఇవ్నాటే, శరద్‌పవార్, రామ్రావ్ సఖారాం వాడ్కుటే, జ్యోతి నాగనాథ్ వాఘ్మారే ఉన్నారు. తమిళనాడు నుంచి క్రిస్టోఫర్ మాణిక్కం, అన్భుమణి రాందాస్‌, కాన్‌స్టాంటైన్ రవీంద్రన్, ఎల్.కె. సుధీష్, ఎం. తంబిదురై, తిరుచి శివ ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఐదుగురు సభ్యులు ప్రమాణం చేశారు. వారిలో బాబుల్‌ సుప్రియో, మేనక గురుస్వామి, రాజీవ్ కుమార్, రుక్మిణి మల్లిక్, బిస్వజిత్ సిన్హా ఉన్నారు. ఒడిశా నుంచి సంతృప్త్ మిశ్రా, దిలీప్‌ రే, మన్మోహన్‌ సమల్‌ ముగ్గురు సభ్యులు ప్రమాణం చేశారు.

సమస్యలపై గళమెత్తుతాం

ప్రమాణ స్వీకారం అనంతరం బిజెడి ఎంపీ సంతృప్త్ మిశ్రా మాట్లాడుతూ ఒడిశాలోని కీలక సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇది తనకు మొదటి సారి పార్లమెంట్‌కు రావడానికి దక్కిన అవకాశమని తెలిపారు. రాష్ట్రానికి వెళ్లి పార్టీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌తో పాటు ఎమ్మెల్యేలు, మేధావులతో చర్చలు జరిపి భవిష్యత్ కార్యక్రమాలను నిర్ణయిస్తామని చెప్పారు. ఇక కాంగ్రెస్ ఎంపీ క్రిస్టోఫర్ మాణిక్కం మాట్లాడుతూ తమిళనాడు ప్రయోజనాలను కాపాడటమే తన ప్రధాన ప్రాధాన్యత అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడును విస్మరించకుండా చూడటం తన లక్ష్యమని తెలిపారు.

కొత్త ఎంపీలు సహకరించాలి

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిరెన్‌రిజిజు కొత్తగా ప్రమాణం చేసిన సభ్యులకు అభినందనలు తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు జరగని సమయంలో కూడా సభ్యులకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లభించడం ప్రత్యేక విషయమని ఆయన పేర్కొన్నారు. కొత్త ఎంపీలు రాజ్యసభ పనితీరును మెరుగుపరచడంలో కీలకంగా సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మహిళల రిజర్వేషన్ సవరణ బిల్లుపై జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ ఐక్యంగా ముందుకు రావాలని రిజిజు పిలుపునిచ్చారు. మహిళా సాధికారత ఒకే పార్టీ విషయం కాదని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల బాధ్యత అని అన్నారు.

మహిళల రిజర్వేషన్‌ చట్ట సవరణ బిల్లుపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏప్రిల్ 16 నుంచి నిర్వహించనున్నారు. ఈ బిల్లు 2023లో పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన కోసం డిలిమిటేషన్ చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమవుతుందని, అందుకే ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా కీలకమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.