Let's talk: editor@tmv.in
రాజ్యసభలో ఆప్ ఉపనేతగా అశోక్‌కుమార్ మిత్తల్

రాజ్యసభలో ఆప్ ఉపనేతగా అశోక్‌కుమార్ మిత్తల్

Pinjari Chand
3 ఏప్రిల్, 2026

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉపనేతగా అశోక్‌ కుమార్‌‌ మిట్టల్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వహించిన రాఘవ్‌ చద్దా స్థానంలో మిత్తల్‌ను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాజ్యసభ కార్యాలయానికి అధికారికంగా లేఖ పంపినట్లు పార్టీ గురువారం వెల్లడించింది. పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యుడైన అశోక్ కుమార్ మిత్తల్ 2022 ఏప్రిల్‌లో సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి పార్లమెంటరీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన డిఫెన్స్‌, ఆర్థిక వ్యవహారాల కమిటీలలో సభ్యుడిగా పనిచేశారు. అలాగే 2026 ఫిబ్రవరిలో ఇండియా–యూఎస్‌ఏ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్‌ గ్రూప్‌ సభ్యుడిగా నియమితులయ్యారు.

గత ఏడాది పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి బదులుగా చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌‌ అనంతరం విదేశీ పర్యటనకు వెళ్లిన అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. కనిమొళి కరుణానిధి నేతృత్వంలో వెళ్లిన ఈ బృందం రష్యా, లాట్వియా, స్లోవేనియా, గ్రీస్, స్పెయిన్ దేశాలను సందర్శించింది.

ఇక రాజ్యసభ సభ్యుడిగా 2022 నుంచే కొనసాగుతున్న రాఘవ్ చద్దా పార్లమెంటులో పలు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ వార్తల్లో నిలిచారు. ఇటీవల పంచాయతీల్లో మహిళల కోసం రిజర్వ్ చేసిన పదవుల్లో భర్తలు లేదా పురుష బంధువులు అసలు అధికారాన్ని వినియోగించే ‘సర్పంచ్ పతి’ వ్యవస్థపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 73వ ఆర్టికల్‌ లక్ష్యాలను సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అదేవిధంగా రుతుక్రమ పరిశుభ్రత అంశాన్ని కూడా ఆయన పార్లమెంటులో ప్రస్తావించారు. దేశంలో కోట్లాది మహిళలు, బాలికల ఆరోగ్యం, విద్యపై దీనికి సంబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్లు, నీరు, గోప్యత లాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల బాలికలు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. ఇటీవల గిగ్ కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు ఒక రోజు డెలివరీ పార్ట్నర్‌గా పనిచేసి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లు కూడా ఆయన తెలిపారు. కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ల రీచార్జ్‌ విధానాలపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

రాజ్యసభలో ఆప్ ఉపనేతగా అశోక్‌కుమార్ మిత్తల్ - Tholi Paluku