Let's talk: editor@tmv.in
రాజ్యసభకు నితీశ్‌కుమార్

రాజ్యసభకు నితీశ్‌కుమార్

Pinjari Chand
17 మార్చి, 2026

రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో బీహార్ నుంచి ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ విజయం సాధించారు. మూడు రాష్ట్రాల్లో జరిగిన 11 రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, ఎక్కువ మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోని 11 స్థానాలకు మాత్రమే సోమవారం పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఎనిమిది స్థానాలు గెలుచుకోగా, బిజుజనతా దళ్ ఒక సీటు దక్కించుకుంది. హర్యానాలోని రెండు స్థానాల ఓట్ల లెక్కింపును మాత్రం గోప్యత ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేశారు.

బీహార్‌లో ఎన్డీఏ క్లీన్ స్వీప్

బీహార్‌లోని ఐదు రాజ్యసభ స్థానాలన్నింటినీ ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. జనతాదళ్(యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్‌తో పాటు కేంద్ర మంత్రి రాంనాథ్‌ కుమార్, ఉపేంద్ర కుష్వాహా తిరిగి ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శివేశ్‌కుమార్‌‌ తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక రాజద్ అభ్యర్థి అమరేంద్ర ధారి సింగ్ ఓటమి పాలయ్యారు. ఐఎంఐఎం, బీఎస్పీ ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుందని తేజస్వీ యాదవ్‌ పేర్కొన్నప్పటికీ ఆయనకు విజయం దక్కలేదు.

ఒడిశాలో బీజేపీకి మూడు సీట్లు

ఒడిశాలో నాలుగు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా, బీజేపీ మూడు సీట్లు గెలుచుకుంది. క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్, బీజేడీ ఎమ్మెల్యేలు బీజేపీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి దిలీప్‌రేకు ఓటు వేసినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్‌సమల్‌, ప్రస్తుత ఎంపీ సుజిత్‌కుమార్, స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రే విజయం సాధించారు. ప్రతిపక్ష బీజేడీ నుంచి సంతృప్త్‌ మిశ్రా ఎన్నికయ్యారు.

హర్యానాలో లెక్కింపు నిలిపివేత

హర్యానాలో రెండు స్థానాలకు జరిగిన ఓటింగ్ అనంతరం ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు. ఓటింగ్ గోప్యత ఉల్లంఘించారన్న ఆరోపణలతో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థి సంజయ్‌ బాటియా , స్వతంత్ర అభ్యర్థి సతీశ్‌ నందల్‌, కాంగ్రెస్ అభ్యర్థి కరమ్‌వీర్‌‌ సింగ్‌ బౌద్ పోటీలో ఉన్నారు.

ముందుగానే ఏకగ్రీవ ఎన్నికలు

ముందుగా జరిగిన నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పలువురు నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిలో శరద్‌పవార్, కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే ఉన్నారు. మహారాష్ట్రలో ఏడు మంది అభ్యర్థులు, పశ్చిమ బెంగాల్‌లో ఐదుగురు, తెలంగాణలో ఇద్దరు, తమిళనాడులో ఆరుగురు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల అనంతరం రాజ్యసభలో బీజేపీ స్థానాలు మరింత పెరగనున్నాయి.