Let's talk: editor@tmv.in
రాజేంద్రనగర్‌‌లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా

రాజేంద్రనగర్‌‌లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా

Gaddamidi Naveen
16 అక్టోబర్, 2025

హైడ్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ భూముల ఆక్రమణలు నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, అందుకే తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ తరుణంలో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాకు గురైన భారీ పార్కు స్థలాన్ని హైడ్రా బుధవారం నాడు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బద్వేల్ , ఉప్పరపల్లి గ్రామాల పరిధిలోని జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2 లలో ఉన్న నాలుగు పార్కు స్థలాల్లో ఈ ఆక్రమణల తొలగింపు జరిగింది.

ప్రధాన అంశాలు

హైడ్రా సుమారు 120 ఎకరాల్లో ఏర్పాటు చేసిన జనచైతన్య లేఔట్‌లో పార్కులు కబ్జాకు గురైనట్లు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పరిశీలనలో ఆక్రమణలు జరిగినట్టు నిర్ధారణ కావడంతో, బుధవారం వాటిని తొలగించేందుకు ఆపరేషన్ చేపట్టారు.

రూ. 139 కోట్ల స్థలం రికవరీ

ఈ చర్య ద్వారా మొత్తం 19,878 గజాల (సుమారు 4.1 ఎకరాలు) పార్కు స్థలాన్ని ఆక్రమణదారుల చెర నుంచి హైడ్రా కాపాడింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం, ఈ భూమి విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

తొలగించిన నిర్మాణాలు

కబ్జాదారులు నిర్మించిన ప్రహరీలు, తాత్కాలిక షెడ్డులు, గదులను హైడ్రా సిబ్బంది తొలగించారు. ఆక్రమణలకు గురైన స్థలాల్లో 3,000 గజాలు, 1,000 గజాలు, 500 గజాల చొప్పున వేసిన షెడ్లు, గదులు నేలమట్టం అయ్యాయి. ఆక్రమణల తొలగింపు పూర్తయిన వెంటనే, ఆక్రమిత స్థలాన్ని కాపాడేందుకు అధికారులు చుట్టూ ఫెన్సింగ్ (కంచె) నిర్మాణ పనులు చేపట్టారు. హైడ్రా చేపట్టిన ఈ చర్యలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు, భవిష్యత్తులో ఆక్రమణలను నిరోధించడానికి ఒక కీలక చర్యగా భావించవచ్చు. అక్టోబర్ 10 న బంజారాహిల్స్ లో ఆక్రమణలను తొలగించి నగరంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుందని మొత్తం రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షించిన విషయం తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను 19 జూలై 2024న అధికారికంగా స్థాపించింది. ఇది పబ్లిక్ ఆస్తులు కాపాడుకోవడం, ఆక్రమణలు తొలగించడం, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పడ్డ సంస్థ. హైడ్రా ఇప్పటి వరకు ఆక్రమణదారుల నుంచి కాపాడిన మొత్తం భూమి సుమారు 923.14 ఎకరాల అని హైడ్రా ఆఫీస్ వెల్లడించింది. ఇందులో పార్కులు, కాలువలు, నాళాలు, రోడ్లు మొదలైనవి ఉన్నాయి. అంచనా విలువల భూభాగాల మొత్తాన్ని ప్రభుత్వానికి సుమారు రూ. 50,000 కోట్లు విలువ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రత్యేక 96 డ్రైవ్స్‌లను నిర్వహించి 581 ఆక్రమణలను తొలగించినట్లు హైడ్రా కమిషనర్ వివరాలుగా వెల్లడించారు.

రాజేంద్రనగర్‌‌లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా - Tholi Paluku