
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకానికి ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ప్రోత్సాహం అందించేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) చేపడుతున్న ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు ఎస్‌సీసీఎల్ చైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి తెలిపారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన వివరాలు వెల్లడించారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే తెలంగాణ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హత నిర్ధారించిన అనంతరం ప్రతి అభ్యర్థికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేస్తామని పేర్కొన్నారు. పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, దరఖాస్తు విధానం కోసం ఎస్‌సీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ http://scclmines.com ను సందర్శించవచ్చని సూచించారు.
తెలంగాణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించాలని, రాష్ట్రంతో పాటు దేశ సేవలో భాగస్వాములు కావాలని డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి ఆకాంక్షించారు. సివిల్ సర్వీసెస్‌లో తెలంగాణ యువత ప్రాతినిధ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల్లో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. 2024లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైందని గుర్తుచేశారు.
పథకం అమలులో భాగంగా 2024 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 140 మందికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించారు. వీరిలో 20 మంది ఇంటర్వ్యూ దశకు చేరుకోగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి అదనంగా మరో రూ.1 లక్ష చొప్పున మంజూరు చేశారు. చివరకు ఏడుగురు అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు.
గత ఏడాది 206 మంది అభ్యర్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, వారిలో 50 మంది ఇంటర్వ్యూ దశకు చేరుకున్నారు. చివరకు 20 మంది సివిల్ సర్వీసెస్‌లో ఎంపికయ్యారు. ఈ విధంగా గత రెండేళ్లలో మొత్తం 346 మంది సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందినట్లు బుద్ధప్రకాశ్ జ్యోతి తెలిపారు.
