Let's talk: editor@tmv.in
రాజా రామ్మోహన్‌రాయ్‌పై వ్యాఖ్య..మధ్యప్రదేశ్ మంత్రి క్షమాపణ

రాజా రామ్మోహన్‌రాయ్‌పై వ్యాఖ్య..మధ్యప్రదేశ్ మంత్రి క్షమాపణ

Pinjari Chand
18 నవంబర్, 2025

ప్రజా నాయకుడు బిర్సా ముండా జయంతి సభలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో మధ్యప్రదేశ్ ఉన్నత విద్యామంత్రి ఇందర్‌సింగ్ పర్మార్ క్షమాపణలు చెప్పారు. నవంబర్ 15న అగర్ మాల్వాలో జరిగిన ‘ట్రైబల్ ప్రైడ్ డే’ కార్యక్రమంలో బ్రిటీష్ కుట్రల గురించి మాట్లాడుతుండగా, రాజా రామ్మోహన్‌రాయ్‌ను ‘బ్రిటీష్ ఏజెంట్‌, నకిలీ సంస్కర్త’గా అభివర్ణించినట్లు ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే పర్మార్ సోషల్‌ మాధ్యమాల్లో వీడియో విడుదల చేసి రాజా రామ్మోహన్‌రాయ్ గొప్ప సామాజిక సంస్కర్త. నా నుంచి పొరపాటున మాట్లాడిన మాటల వల్ల బాధ పడ్డాను. ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను అని పేర్కొన్నారు.

అంతేకాకుండా బిర్సా ముండా జీవితంలో బ్రిటీష్ ప్రభుత్వం చేసిన కుట్రలను చెప్పే క్రమంలో, మాటల ప్రవాహంలో తప్పుగా ఆయన పేరును ప్రస్తావించాను. వ్యక్తిగతంగా ఆయనకు నేను గౌరవం ఇచ్చే వ్యక్తినే. పూర్తిగా అనుకోకుండా జరిగిన పొరపాటు మాత్రమేనని స్పష్టంచేశారు. ఈ వివాదం నేపథ్యంలో మంత్రి మరోసారి వివరణ ఇచ్చి క్షమాపణలు తెలిపారు. 1875 నవంబర్ 15న జన్మించిన బిర్సా ముండా, బ్రిటీష్ పాలనలో ఆదివాసీల హక్కులు, సంప్రదాయాల పరిరక్షణ కోసం ధార్మిక–సామాజిక ఉద్యమాన్ని నడిపిన మహా నేతగా గుర్తింపు పొందారు.