Let's talk: editor@tmv.in
రాజానగరం పరిసరాల్లో పులి కలకలం

రాజానగరం పరిసరాల్లో పులి కలకలం

Dantu Vijaya Lakshmi Prasanna
5 ఫిబ్రవరి, 2026

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి, పులి గాలింపు చర్యలకు సంబంధించిన తాజా పరిస్థితిని సమీక్షించారు.

పులి కదలికలను కనిపెట్టేందుకు అటవీ శాఖ యంత్రాంగం అత్యునాతన సాంకేతికతను ఉపయోగిస్తోందని మంత్రి వెల్లడించారు. తొర్రేడు, సీతానగరం, రాజానగరం ప్రాంతాల్లో పులి సంచార ఆనవాళ్లు గుర్తించిన చోట వ్యూహాత్మకంగా బోన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో డ్రోన్ కెమెరాలు, హై-డెఫినిషన్ ట్రాప్ కెమెరాలు, అవసరమైన చోట్ల బోన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పులి సంచరించిన దాఖలాలు ఉన్నాయని గుర్తు చేసిన మంత్రి, ఈసారి త్వరితగతిన దానిని బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రజల రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేస్తూ, అటవీ ప్రాంతం, పొలాల వెంబడి హెచ్చరిక బోర్డులను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పులి పట్టుబడే వరకు రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఇటీవల తొర్రేడు గ్రామంలో లేగ దూడలపై దాడిచేసిందని అందువల్ల ముఖ్యంగా రాత్రి సమయాల్లో పశువుల పాకల వద్ద కాంతివంతమైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ఆ పరిసర ప్రాంత పాఠశాలలకు గత రెండురోజులుగా సెలవు ప్రకటించామనీ, ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో పులి తిరుగుతున్నట్టు సమాచారం ఉంది అని, అటవీ శాఖ అధికారుల సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. త్వరలోనే పులిని సురక్షితంగా పట్టుకుని, ప్రజలకు భయం పోగొడతామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కాగా, అంతుచిక్కకుండా కొన్ని రోజులుగా జిల్లావాసులకు కంటిపై కునుకులేకుండా చేస్తున్న పెద్దపులి రాజమండ్రి దగ్గర దివాన్‌చెరువు వద్ద స్థానికుల కంటపడింది. దీంతో నగర, శివారు ప్రాంతాలవారు ఆందోళనకు గురయ్యారు. జనవరి 20న ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోకి ప్రవేశించింది. జనవరి 31న పట్టిసీమ నుంచి గోదావరి దాటి సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 2న రాజమహేంద్రవరం గ్రామీణం వెంకటనగరంలో పులి పాదముద్రలు గుర్తించారు. తొర్రేడు, వెంకటనగరం, కాతేరు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఫిబ్రవరి 1న సీతానగరం మండలం తొర్రేడు గ్రామంలో రెండు ఆవులును, ఒక దూడపై దాడి చేసి, చంపేసింది. రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలో కోలమూరు మీదుగా గాడాలకు వచ్చినట్లు మంగళవారం ఉదయం గుర్తించారు. మంగళవారం రాత్రికి గామన్‌ వంతెనకింద రోడ్డుపై నుంచి ఆటోనగర్‌ మీదుగా ఎస్‌వీపీఎస్‌ ఫంక్షన్‌ హాలు, డిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ మధ్యలో ఉన్న కొబ్బరితోటలోకి చేరింది.

ప్రస్తుతం పులి ఉన్న తోట విశాఖపట్నం- విజయవాడ జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ మేరకు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అదే సమయంలో తోటలోని ఓ పెంకుటింట్లో తోటమాలి కుటుంబం ఉంటోంది. తండ్రి, తల్లి, అక్క, తమ్ముడు ఉంటున్నారు. పోలీసులు వారితో ఫోన్‌లో మాట్లాడారు. సమాచారం ఇచ్చే వరకు బయటకు రావొద్దని హెచ్చరించారు.

రాజానగరం పరిసరాల్లో పులి కలకలం - Tholi Paluku