Let's talk: editor@tmv.in
రాజస్థాన్ హ్యాట్రిక్ విజయం
రాజస్థాన్ హ్యాట్రిక్ విజయం

రాజస్థాన్ హ్యాట్రిక్ విజయం

Shaik Mohammad Shaffee
8 ఏప్రిల్, 2026

ఐపీఎల్-2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేస్తూ ‘హ్యాట్రిక్’ కొట్టింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ 27 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించిన రాయల్స్.. ఇప్పుడు ముంబైని కూడా చిత్తు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

జైస్వాల్ వీరవిహారం

వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు శివతాండవం చేశారు. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (32 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడికి తోడుగా 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో 39) ముంబై బౌలర్లను ఉతికి ఆరేశాడు. స్టార్ బౌలర్ బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే సూర్యవంశీ రెండు భారీ సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. వీరిద్దరి ధాటికి రాజస్థాన్ 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగుల భారీ స్కోరు సాధించింది.

బెంబేలెత్తిన ముంబై

కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు రాజస్థాన్ బౌలర్లు చుక్కలు చూపారు. సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, నాండ్రే బర్గర్ తలో రెండు వికెట్లు తీసి ముంబై బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (25), నమన్ ధీర్ (25) కాసేపు మెరిసినా.. రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యం ముందు అది ఏమాత్రం సరిపోలేదు. నిర్ణీత 11 ఓవర్లలో ముంబై 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన రాజస్థాన్ ప్రస్తుతం 6 పాయింట్లతో లీగ్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచింది.

సంక్షిప్త స్కోర్లు:

రాజస్థాన్ రాయల్స్:

11 ఓవర్లలో 150/3 (యశస్వి జైస్వాల్ 77 నాటౌట్, వైభవ్ సూర్యవంశీ 39)

ముంబై ఇండియన్స్:

11 ఓవర్లలో 123/9 (రూథర్‌ఫర్డ్ 25, నమన్ ధీర్ 25; నాండ్రే బర్గర్ 2/21, రవి బిష్ణోయ్ 2/25)