
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా జట్టు సారథిగా ఉన్న స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్.. చెన్నై సూపర్ కింగ్స్‌కు మారడంతో, ఆ స్థానంలో అస్సాం యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 2019 నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టులోనే కొనసాగుతున్న 24 ఏళ్ల పరాగ్.. లీగ్ చరిత్రలో అతి తక్కువ వయసులో కెప్టెన్లయిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.
రియాన్ పరాగ్ భావోద్వేగం
తన నియామకంపై రియాన్ పరాగ్ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. "ఐపీఎల్‌లో మొదటి రోజు నుంచి రాజస్థాన్ రాయల్స్ నా సొంతిల్లు లాంటిది. ఈ ఫ్రాంచైజీ నాకు అండగా నిలిచి, నా ఎదుగుదలకు ఎంతో సహకరించింది. ఇప్పుడు ఈ జట్టును నడిపించే బాధ్యత రావడం చాలా ప్రత్యేకం. కోచ్‌లు, సీనియర్ల సహకారంతో మా అభిమానులు గర్వపడేలా క్రికెట్ ఆడతాం" అని పరాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గత సీజన్‌లో శాంసన్ గాయపడిన సమయంలో పరాగ్ ఎనిమిది మ్యాచ్‌లకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. అయితే అప్పట్లో జట్టు కేవలం రెండు విజయాలే సాధించి 9వ స్థానంలో నిలిచినా, బ్యాటర్‌గా పరాగ్ 14 ఇన్నింగ్స్‌ల్లో 393 పరుగులు చేసి తన సత్తా చాటాడు.
సంప్రదింపుల తర్వాతే పగ్గాలు: సంగక్కర
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర మాట్లాడుతూ.. పరాగ్ జట్టులో ఒక ప్రభావవంతమైన ఆటగాడిగా ఎదిగాడని కొనియాడారు. ఒత్తిడిలోనూ నిలకడగా రాణించే తత్వం, పదునైన క్రికెట్ పరిజ్ఞానం అతడి సొంతమని, అందుకే డ్రెస్సింగ్ రూమ్‌లో అతడికి మంచి గౌరవం ఉందని పేర్కొన్నారు. 2024 సీజన్‌లో 573 పరుగులు చేసి అదరగొట్టిన పరాగ్, ఓవరాల్‌గా 84 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 141.84 స్ట్రైక్ రేట్‌తో 1,566 పరుగులు సాధించాడు. పరాగ్ నాయకత్వ లక్షణాలు, ఎదుగుదలపై ఫ్రాంచైజీ యజమాని మనోజ్ బదాలే కూడా పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
కొత్త కోచింగ్ బృందం సిద్ధం
రాహుల్ ద్రవిడ్ నిష్క్రమణ తర్వాత, రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు కొత్త కోచింగ్ బృందంతో బరిలోకి దిగుతోంది. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, హెడ్ కోచ్‌గా కుమార్ సంగక్కర బాధ్యతలు నిర్వహించనుండగా, ఆయనకు సహాయకులుగా విక్రమ్ రాథోడ్ (లీడ్ అసిస్టెంట్ కోచ్), షేన్ బాండ్ (ఫాస్ట్ బౌలింగ్ కోచ్), ట్రెవర్ పెన్నీ (అసిస్టెంట్ కోచ్), సిద్ లాహిరి (పెర్ఫార్మెన్స్ కోచ్) వ్యవహరించనున్నారు. ఈ కొత్త నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026 సీజన్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.
