Let's talk: editor@tmv.in
రాజస్థాన్ రాయల్స్‌కు షాక్: ఐపీఎల్ 2026కు శామ్‌ కరన్‌ దూరం

రాజస్థాన్ రాయల్స్‌కు షాక్: ఐపీఎల్ 2026కు శామ్‌ కరన్‌ దూరం

Gaddamidi Naveen
21 మార్చి, 2026

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ శామ్‌ కరన్‌ గజ్జల్లో గాయం కారణంగా ఈ ఏడాది టోర్నీకి దూరమయ్యాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టులో కరన్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఆ సమయంలోనే అతనికి ఈ గాయమైనట్లు సమాచారం.

గత ఏడాది ఐపీఎల్ ట్రేడింగ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి శామ్‌ కరన్‌, రవీంద్ర జడేజాలను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. దీనికి బదులుగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను సీఎస్‌కేకు బదిలీ చేసింది. 27 ఏళ్ల శామ్‌ కరన్‌ గతంలో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2023 వేలంలో రూ. 18.5 కోట్లతో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన కర్రన్, 2025 సీజన్‌లో సీఎస్‌కే తరపున 5 మ్యాచ్‌ల్లో 114 పరుగులు చేసి ఒక వికెట్ తీశాడు.

రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఈసారి అనుభవజ్ఞులైన రవీంద్ర జడేజా లేదా శామ్‌ కరన్‌లను పక్కన పెట్టి, రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా నియమించడంపై మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు కర్రన్ దూరం కావడంతో జట్టులో ఆల్ రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడం సవాలుగా మారింది.

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ వద్ద రవీంద్ర జడేజాతో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన హిట్టర్ డొనోవన్ ఫెరీరా అందుబాటులో ఉన్నాడు. ఫెరీరా భారీ షాట్లు ఆడటంతో పాటు అవసరమైనప్పుడు ఆఫ్-స్పిన్ కూడా వేయగలడు. అయినప్పటికీ, కరన్‌ స్థానంలో మరో విదేశీ ఆటగాడిని తీసుకునే దిశగా ఫ్రాంచైజీ కసరత్తు చేస్తోంది. రాజస్థాన్ రాయల్స్ తన ప్రత్యామ్నాయ ఆటగాడిని రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.