
రాజస్థాన్‌లో పటాకుల కర్మాగారంలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం
రాజస్థాన్‌లో ఖైర్‌తల్-తిజారా జిల్లాలోని భివాడి పట్టణంలో అక్రమంగా పటాకులు తయారు చేస్తున్న కర్మాగారంలో సోమవారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటన భివాడిలోని ఖుష్‌ఖేరా-కరోలి పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సుమిత్రా పారీక్ తెలిపిన వివరాల ప్రకారం, ఆ ప్రాంగణాన్ని గార్మెంట్ ఫ్యాక్టరీ పేరిట లీజ్‌కు తీసుకున్నప్పటికీ, అక్కడ అక్రమంగా పటాకుల తయారీ జరుగుతోందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తొలుత ఇది రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదమని అధికారులు భావించారు. అగ్ని ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 20 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే పలువురు బయటకు పరుగులు తీశారు. అయితే తొమ్మిది మంది లోపలే చిక్కుకుపోయారు. వారిలో ఏడుగురు సజీవదహనమయ్యారు. ఇద్దరిని రక్షించి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగానే ఉంది.
సాధారణ పహారా సమయంలో పోలీసులు ఈ ఘటనను గుర్తించి వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించారు. మంటలను అదుపులోకి తేవడానికి గంటన్నర కంటే ఎక్కువ సమయం పట్టింది. ఘటన స్థలంలో ఎముకలు, అవశేషాలు లభించాయి. మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి కొన్ని అస్థిపంజరాలుగా మారాయి. కొన్ని శరీర భాగాలు చెల్లాచెదురుగా లభించగా, వాటిని రక్షణ సిబ్బంది పొలిథిన్ సంచుల్లో సేకరించారు. మరణించిన వారిలో కొందరు బీహార్‌కు చెందిన కార్మికులని సమాచారం. ఘటనకు ముందు పెద్ద పేలుడు సంభవించినట్లు సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఫ్యాక్టరీలో గన్‌పౌడర్, పటాకులు, ప్యాకింగ్ బాక్సులు లభించాయి. ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని ఎముకలు, కాలిన పటాకుల నమూనాలను సేకరించింది.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ జిల్లా యంత్రాంగానికి తక్షణ సహాయ, రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీ శాఖ మంత్రి సంజయ్ శర్మను అల్వార్‌కు వెళ్లాలని సూచించారు. అనంతరం అక్కడికి చేరుకున్న మంత్రి, అన్ని పారిశ్రామిక యూనిట్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన యూనిట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆర్టికా శుక్లా ఘటనపై దర్యాప్తు ఆదేశించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను హెంశాఖ సహాయ మంత్రి జవహర్ సింగ్ బేధం విచారిస్తున్నట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటాస్రా ఘటనను దురదృష్టకరమని పేర్కొని సమగ్ర విచారణ కోరారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, ప్రతిపక్ష నేత టికారం జూల్లీ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
