Let's talk: editor@tmv.in
రాజస్థాన్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ ఘన విజయం
రాజస్థాన్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ ఘన విజయం

రాజస్థాన్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ ఘన విజయం

Shaik Mohammad Shaffee
14 ఏప్రిల్, 2026

ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ గర్జించింది. వరుస ఓటములతో డీలా పడ్డ ఆరెంజ్ ఆర్మీకి కొత్త కుర్రాడు ప్రఫుల్ హింజ్ ఊపిరి పోశాడు. తన అరంగేట్రం మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన హింజ్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ తొలి ఓవర్‌ను నమోదు చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన పోరులో సన్‌రైజర్స్ 57 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత ఇషాన్ కిషన్ (91) విధ్వంసంతో హైదరాబాద్ 216 పరుగులు చేయగా.. హింజ్ (4/34), సాకిబ్ హుస్సేన్ (4/24) ధాటికి రాజస్థాన్ 159 పరుగులకే కుప్పకూలింది.

తొలి ఓవర్‌లోనే హింజ్ సంచలనం

రాజస్థాన్ రాయల్స్ ముందు 217 పరుగుల భారీ లక్ష్యం ఉన్నా, హైదరాబాద్ కొత్త బౌలర్ ప్రఫుల్ హింజ్ దెబ్బకు మ్యాచ్ మొత్తం మారిపోయింది. విదర్భకు చెందిన ఈ 24 ఏళ్ల కుర్రాడు తన కెరీర్ మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు. మొదటి బంతికే సూర్యవంశీని అవుట్ చేసిన హింజ్, ఆ వెంటనే ధ్రువ్ జురెల్, ప్రిటోరియస్‌లను కూడా పెవిలియన్‌కు పంపాడు. మరోవైపు మరో కొత్త బౌలర్ సాకిబ్ హుస్సేన్ కూడా యశస్వి జైస్వాల్‌ను అవుట్ చేయడంతో రాజస్థాన్ జట్టు కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఘోరమైన కష్టాల్లో పడిపోయింది. హింజ్, సాకిబ్‌ల ధాటికి రాజస్థాన్ బ్యాటర్లు కనీసం క్రీజులో నిలబడలేకపోయారు.

ఆదుకున్న ఫెరీరా - జడేజా

9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో డోనోవన్ ఫెరీరా (69; 44 బంతుల్లో), రవీంద్ర జడేజా (45) పట్టుదలగా ఆడారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 118 పరుగులు జోడించి ఓటమి అంతరాన్ని తగ్గించారు. అయితే సాకిబ్ హుస్సేన్ వరుస విరామాల్లో వికెట్లు తీసి రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లాడు. 19 ఓవర్లలో రాజస్థాన్ 159 పరుగులకు ఆలౌట్ అయింది.

ఇషాన్ కిషన్ ‘కెప్టెన్’ ఇన్నింగ్స్

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ తొలి బంతికే అవుటైనా.. కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కిషన్ కేవలం 44 బంతుల్లోనే 91 పరుగులు (8 ఫోర్లు, 6 సిక్సర్లు) చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ (40) తో కలిసి మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరి ఓవర్లలో నితీష్ రెడ్డి (28), సలీల్ అరోరా (24) వేగంగా ఆడటంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 2 వికెట్లు తీశాడు.

తర్ఫీదు పొంది.. చరిత్ర సృష్టించి!

ప్రఫుల్ హింజ్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో గ్లెన్ మెక్‌గ్రాత్ పర్యవేక్షణలో మెరుగులు దిద్దుకున్న ఈ కుర్రాడు.. ఆస్ట్రేలియాలోనూ శిక్షణ పొందాడు. నిజానికి ఏప్రిల్ 11నే డెబ్యూ చేయాల్సి ఉన్నా.. ఆఖరి నిమిషంలో అవకాశం చేజారింది. అయితే సోమవారం వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని వికెట్ల వేటతో ఐపీఎల్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు.

సంక్షిప్త స్కోర్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్:

216/6 (ఇషాన్ కిషన్ 91, క్లాసెన్ 40; ఆర్చర్ 2/37)

రాజస్థాన్ రాయల్స్:

159 (19 ఓవర్లలో) (ఫెరీరా 69, జడేజా 45; సాకిబ్ హుస్సేన్ 4/24, ప్రఫుల్ హింజ్ 4/34)