Let's talk: editor@tmv.in
రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు

రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు

Panthagani Anusha
4 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియ ముగిసిన గ్రామాల్లో రైతులకు శాశ్వత భూ హక్కు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. శుక్రవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22 లక్షల కొత్త పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఎటువంటి రాజకీయ ముద్రలు లేకుండా ప్రభుత్వ అధికారిక రాజముద్రతో ముద్రించిన ఈ పత్రాలను రైతులకు అందజేస్తున్నారు.

ఈ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు నూతన సంవత్సర కానుకగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు తమ భూమిపై సర్వహక్కులు కల్పిస్తూ రాజముద్రతో ఉన్న పాస్‌బుక్‌లను అందించడం వారికి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. ఎన్నికల సమయంలో మేమిచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, పారదర్శకమైన పాలన దిశగా ఈ అడుగు వేస్తున్నాం అని ప్రకటించారు. జనవరి 9వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, రైతుల చేతికే నేరుగా ఈ పత్రాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సీఎం

గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భూములపై అనవసర వివాదాలను సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. గత పాలకులు పాస్‌బుక్కులపై తమ వ్యక్తిగత చిత్రాలను ముద్రించుకోవడానికి ప్రజల సొమ్ము రూ. 22 కోట్లను దుర్వినియోగం చేశారు. ఆ చిత్రాల వల్ల రైతులకు కలిగిన ప్రయోజనం శూన్యం. మేము అధికారంలోకి రాగానే రాజకీయ రంగులు తొలగించి, ప్రభుత్వ గౌరవాన్ని ప్రతిబింబించేలా రాజముద్రతో నాణ్యమైన పాస్‌బుక్కులను సిద్ధం చేశాం అని చంద్రబాబు స్పష్టం చేశారు. అదేవిదంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని రైతులకు పాస్‌బుక్‌లు అందిస్తారని అధికారులు తెలిపారు.

ప్రధాన కార్యదర్శి కీలక ఆదేశాలు

ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేలా జిల్లా కలెక్టర్లను స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశంలో పాస్‌బుక్‌ల పంపిణీ, రైల్వే అండర్/ఓవర్ బ్రిడ్జిల కోసం భూసేకరణ, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, డాక్యుమెంట్ అప్లోడ్ ఏజెంట్ వంటి అంశాలపై చర్చ జరిగింది.

సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ పాత పాస్‌బుక్‌ల స్థానంలో రాజముద్రంతో కూడిన కొత్త పాస్‌బుక్‌ల పంపిణీ కొనసాగుతున్నదని, భూమి ఉన్న ప్రతి రైతుకి ప్రతినెలా ఈ పాస్‌బుక్‌లు అందిస్తామని తెలిపారు. ఈ విషయమై కలెక్టర్లకు ప్రత్యక్ష పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో పాస్‌బుక్‌ల పంపిణీ జరగాలని, పాత పాస్‌బుక్‌లను సరిగా రద్దు చేసి కొత్త పాస్‌బుక్‌లను అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు.