
రాజమహేంద్రవరం శివార్లలో పులి సంచారం
రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి ప్రవేశించిన ఈ 'పెద్ద పులి ' పశువులపై వరుస దాడులకు తెగబడుతోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఎనిమిది పశువులను హతమార్చడంతో దివాన్‌చెరువు, పుణ్యక్షేత్రం పరిసర గ్రామాల్లోఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి భయాందోళనలు స్థాయికి చేరుకున్నాయి. కాగా గత 15 రోజులుగా ఈ పులి దివాన్‌చెరువు – రాజమహేంద్రవరం మధ్య తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.
సుమారు నాలుగు రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లా పుణ్యక్షేత్రం గ్రామ సమీపంలోని అంకమ్మ తల్లి కొండ ఆలయ పరిసరాల్లో ఈ పులి తొలిసారిగా కంటపడింది. అప్పటి నుంచి స్థానిక తోటలు, వ్యవసాయ భూముల్లో మాటువేస్తూ పశువులను లక్ష్యంగా చేసుకుంటోంది. మొదట నాలుగు పశువులను చంపిన పులి, గురువారం మరో నాలుగు పశువులపై దాడి చేయడంతో మరణించిన పశువుల సంఖ్య ఎనిమిదికి చేరింది.
మహారాష్ట్ర నుంచి వలస?
ఈ పులి మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుంచి వలస వచ్చి ఉండొచ్చని అటవీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆహారం వేటలోనూ తనకంటూ ప్రత్యేక భూభాగాన్ని ఏర్పరచుకునే క్రమంలో అడవుల నుంచి ఆంధ్రా సరిహద్దుల్లోకి ప్రవేశించి ఉండవచ్చని భావిస్తున్నారు. అటవీ విస్తీర్ణం తగ్గడం, అడవిలో ఆహార కొరత ఏర్పడటమే పులులు జనావాసాల వైపు రావడానికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు.
రంగంలోకి ట్రాంక్విలైజర్ బృందాలు
మరోవైపు ఈ పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పులి కదలికలను నిశితంగా గమనించేందుకు ప్రధాన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులిని సురక్షితంగా బంధించేందుకు మహారాష్ట్రలోని పూణే నుంచి ప్రత్యేక ట్రాంక్విలైజర్ (మత్తు మందు ఇచ్చే) బృందాన్ని రప్పించారు. అడుగుజాడల ఆధారంగా ట్రాకింగ్ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
ఇదిలా ఉండగా ప్రధాన రహదారులు, జనావాసాల వద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, తోటలు, వ్యవసాయ పొలాల్లోకి వెళ్లేటప్పుడు సమూహంగా వెళ్లాలని కోరారు.
