Let's talk: editor@tmv.in
రాజమహేంద్రవరం మెడికో ప్రియాంక మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

రాజమహేంద్రవరం మెడికో ప్రియాంక మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

Gaddamidi Naveen
10 ఆగస్టు, 2026

రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో మంచి భవిష్యత్ ఉన్న విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.

రాజమహేంద్రవరంలోని ఓ షాపింగ్ మాల్‌ వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు ప్రియాంక, ఉమేశ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఓ కారు వారిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ప్రమాదంలో ప్రియాంకకు తీవ్ర తలకు గాయమైంది. సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 3:40 గంటలకు ఆమె మృతి చెందారు. ఉమేశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మద్యం మత్తులో వాహనం నడిపిన యువకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమాయకురాలి ప్రాణాలను బలిగొన్న వారి నిర్లక్ష్యాన్ని క్షమించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారని తెలిపారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చంద్రబాబు వెల్లడించారు. చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

రాజమహేంద్రవరం మెడికో ప్రియాంక మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర విచారం - Tholi Paluku