Let's talk: editor@tmv.in
రాజమహేంద్రవరం కల్తీ పాల విషాదం: 14కు చేరిన మరణాల సంఖ్య

రాజమహేంద్రవరం కల్తీ పాల విషాదం: 14కు చేరిన మరణాల సంఖ్య

Panthagani Anusha
14 మార్చి, 2026

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర పరిధిలోని లాలచెరువు ప్రాంతంలో కల్తీ పాల కలకలం పెను విషాదాన్ని మిగిల్చింది. కల్తీ పాలను తాగి తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుల్లో మరణాల సంఖ్య శుక్రవారం నాటికి 14కు చేరుకుంది. నిన్నటి వరకు 13గా ఉన్న మృతుల సంఖ్య, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో బాధితుడు కన్నుమూయడంతో పెరిగింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఆరుగురు బాధితులు మృత్యువుతో పోరాడుతున్నారు. వారి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

ఈ ఘోరానికి కారణం పాలలో కలిసిన ‘ఇథిలిన్ గ్లైకాల్’ అనే ప్రమాదకర రసాయనమని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలు స్పష్టం చేశాయి. కాగా నిందితుడు అడ్డాల గణేశ్వరరావు పాలను నిల్వ చేసే ఫ్రీజర్‌కు లీకేజీ ఏర్పడటంతో దానికి టింకరింగ్ వర్క్‌షాప్‌లో మరమ్మతు చేయించాడు. లీకేజీని అరికట్టేందుకు లోపలి భాగంలో వాడిన ఒక రసాయన పూత పాలలో కరగడంతో అది విషతుల్యంగా మారింది. ఈ పాలు తాగిన బాధితులకు తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం సంభవించి ఆపై మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

దర్యాప్తు వివరాల ప్రకారం ఫిబ్రవరి 16 నుంచే ఈ కల్తీ పాల సరఫరా ప్రారంభమైంది. లాలచెరువు పరిసరాల్లోని చౌడేశ్వరనగర్, స్వరూపానగర్ ప్రాంతాల్లోని సుమారు 20 మందికి పైగా ఈ పాలను సేవించి అస్వస్థతకు గురయ్యారు. పాలు చేదుగా ఉన్నాయని వింత వాసన వస్తున్నాయని కొంతమంది వినియోగదారులు ముందే హెచ్చరించినా నిందితుడు గణేశ్వరరావు బాధ్యతారాహిత్యంగా అదే పాలను విక్రయించినట్లు తేలింది. ఫిబ్రవరి 22న తాడి కృష్ణవేణి (76) మరణించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా ఆమె కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.