Let's talk: editor@tmv.in
రాజమహేంద్రవరం కల్తీ పాల విషాదం: కూలెంట్ లీకేజీపై అనుమానాలు

రాజమహేంద్రవరం కల్తీ పాల విషాదం: కూలెంట్ లీకేజీపై అనుమానాలు

Panthagani Anusha
25 ఫిబ్రవరి, 2026

రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘విషపు పాలు’ ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పాలు తాగిన కొద్దిసేపటికే నలుగురు వ్యక్తులు మృతి చెందడం వెనుక అసలు కారణాలను విశ్లేషిస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు ప్రాథమికంగా వెలుగులోకి వచ్చాయి. విక్రేత నివాసంలోని ఫ్రీజర్ నుంచి రసాయన శీతలకరణి(కూలెంట్) లీక్ అయి ఉండవచ్చని అది పాలలో కలవడమే ఈ ఘోరానికి దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇది కేవలం పోలీసుల ప్రాథమిక అంచనా మాత్రమేనని, శాస్త్రీయంగా ఇంకా నిరూపణ కాలేదని అధికారులు స్పష్టం చేశారు.

కిడ్నీలపై రసాయన ప్రభావం?

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం కలుషితమైన పాలు తాగిన బాధితుల్లో ఆకస్మికంగా మూత్రపిండాల (కిడ్నీ) వైఫల్యం సంభవించింది. శరీరంలో మూత్ర విసర్జన ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయి (అనూరియా), విషతుల్యాలు పెరిగిపోవడంతో బాధితులు మరణించినట్లు వైద్యులు గుర్తించారు. గత రెండు రోజుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది వివిధ ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ రసాయన చర్య ఎంత వేగంగా జరిగిందనేది ఇప్పుడు వైద్య నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడైన పాల విక్రేత తన ఇంట్లోని రెండు కంటైనర్ల ఫ్రీజర్‌లో పాలను నిల్వ చేశాడు. పంపిణీ కోసం ఆరు డబ్బాల్లో పాలను నింపి అందులో తాజాగా సేకరించిన పాలను కూడా కలిపాడు. అయితే ఫ్రీజర్ నుంచి కూలెంట్ లీక్ అయ్యి నిల్వ ఉంచిన పాలలో కలిసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా నిందితుడి నివాసంలోని ఫ్రీజర్‌ను తనిఖీ చేయగా కొన్ని కీలక ఆనవాళ్లు కనిపించాయి. అవసరమైన అన్ని నమూనాలను సేకరించి విజయవాడలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపినట్లు ఎస్పీ వెల్లడించారు.

మరోవైపు ఈ దారుణానికి బాధ్యుడైన పాల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి సంబంధించిన డెయిరీ యూనిట్‌ను అధికారులు సీజ్ చేసి నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఫోరెన్సిక్ నివేదిక, బాధితుల పోస్ట్ మార్టం రిపోర్టులు అందిన తర్వాత పాలలో కలిసిన విష పదార్థం ఏంటనేది అధికారికంగా తేలనుంది. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.