Let's talk: editor@tmv.in
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన…16కు చేరిన మృతుల సంఖ్య

రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన…16కు చేరిన మృతుల సంఖ్య

Panthagani Anusha
23 మార్చి, 2026

తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాలు ఘటన రోజు రోజుకీ విషాదాన్ని మరింత పెంచుతోంది. తాజాగా మరో మరణం సంభవించడంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16కు చేరింది. ప్రస్తుతం ముగ్గురు బాధితులు రాజమహేంద్రవరం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఫిబ్రవరి మధ్యలో లాలాచెరువు పరిసర ప్రాంతాల్లో సరఫరా చేసిన పాలను తగిన తరువాత పలువురిలో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వాంతులు, కడుపునొప్పి, మూత్రం తగ్గిపోవడం వంటి లక్షణాలతో బాధితులు ఆసుపత్రులను ఆశ్రయించగా కొందరికి ఆకస్మిక మూత్రపిండ వైఫల్యం ఏర్పడి పరిస్థితి విషమించింది. కాగా ఫిబ్రవరి 22న చౌడేశ్వరనగర్, స్వరూపానగర్ ప్రాంతాల్లో ఇలాంటి కేసులు గుంపుగా వెలుగులోకి రావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించింది.

ప్రాథమికంగా ఎథిలీన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనం కలిసిన పాలు తాగడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ రసాయనం ప్రభావంతో బాధితుల్లో కిడ్నీ పనితీరు దెబ్బతిని అనంతరం బహుళ అవయవాల వైఫల్యానికి దారి తీసినట్లు వైద్యులు చెబుతున్నారు.

కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలోని ఒక డెయిరీ యూనిట్ నుంచి సరఫరా చేసిన పాలను ఈ ఘటనకు మూలంగా గుర్తించారు. దాంతో ఆ యూనిట్ నుంచి పాలు సరఫరాను వెంటనే నిలిపివేశారు. మరోవైపు ఫిబ్రవరి 16 నుంచి మార్చి 21 వరకు మొత్తం 20 మంది ఆసుపత్రుల్లో చేరగా అందులో 16 మంది మృతి చెందారు. ఇక ముగ్గురు చికిత్స పొందుతుండగా ఒకరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇదిలా ఉండగా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, రాపిడ్ రెస్పాన్స్ బృందాలను రంగంలోకి దించారు. ఇంటింటి సర్వేలు నిర్వహించి వందలాది మందికి పరీక్షలు చేపట్టారు. ఎక్కువమందికి సాధారణ ఫలితాలే వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు సంబంధిత డెయిరీ యూనిట్‌ను తనిఖీ చేసి పాలు, పెరుగు, నెయ్యి, పనీర్ తదితర నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపారు.ఇక పోలీసులు కేసు నమోదు చేసి అనుమానిత పాల సరఫరాదారుని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ పూర్తి స్థాయి నివేదికలు వెలువడిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.