Let's talk: editor@tmv.in
రాజమహేంద్రవరం ఇండోర్ స్టేడియం కాంప్లెక్స్ నిర్మాణానికి సహకరించండి:ఎంపీ పురందేశ్వరి

రాజమహేంద్రవరం ఇండోర్ స్టేడియం కాంప్లెక్స్ నిర్మాణానికి సహకరించండి:ఎంపీ పురందేశ్వరి

Panthagani Anusha
14 ఫిబ్రవరి, 2026

రాజమహేంద్రవరం నగర యువతకు అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతులు కల్పించే లక్ష్యంతో వి.ఎల్.పురంలో ప్రతిపాదించిన 'అరినా–3' క్రీడా సముదాయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయను కలిసిన ఆమె ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించి అవసరమైన నిధుల మంజూరుపై ప్రత్యేకంగా అభ్యర్థించారు.

కాగా నగరంలో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు మొత్తం మూడు దశల్లో ఈ సముదాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే అరినా–1గా ప్రతిపాదించిన ఇండోర్ స్టేడియానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.28 కోట్లను మంజూరు చేయగా అరినా–2 (60 మీ x 40 మీ) నిర్మాణానికి 'ఖేలో ఇండియా' పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.13.76 కోట్ల నిధులను ఆమోదించింది. ఈ రెండు దశల పనులు పూర్తయితే ప్రాంతీయ స్థాయిలో క్రీడాకారులకు గొప్ప వేదిక లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు మిగిలిన అరినా–3 నిర్మాణానికి రూ.14 కోట్ల నిధులు మంజూరు చేయాలని పురందేశ్వరి మంత్రిని కోరారు. ఇక్కడ బాస్కెట్‌బాల్, వాలీబాల్, మార్షల్ ఆర్ట్స్, రెజ్లింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్ వంటి క్రీడలకు అవసరమైన ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

రాజమండ్రి ప్రాంతంలో ప్రస్తుతం క్రీడా మౌలిక వసతులు పరిమితంగా ఉన్నాయని ఈ మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు జాతీయ స్థాయిలో రాణించే అవకాశం లభిస్తుందని ఎంపీ పేర్కొన్నారు. అంతేకాకుండా రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా కూడా ఈ సముదాయం బహుళ ప్రయోజనకారి గా మారుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో క్రీడా రంగానికి కొత్త ఊపు రావడమే కాకుండా, రాష్ట్ర ,జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు మార్గం సుగమం అవుతుందని క్రీడా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.