Let's talk: editor@tmv.in
రాజమహేంద్రవరంలో ‘కల్తీ పాల’ విషాదం

రాజమహేంద్రవరంలో ‘కల్తీ పాల’ విషాదం

Panthagani Anusha
24 ఫిబ్రవరి, 2026

రాజమహేంద్రవరం నగర శివార్లలో కల్తీ పాలు పెను విషాదాన్ని నింపాయి. అనాధికార విక్రేత సరఫరా చేసిన పాలు సేవించి గత 48 గంటల్లో నలుగురు వృద్ధులు ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున భారీ పరిహారాన్ని ప్రకటించారు. నగరంలోని లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

మృత్యువుతో పోరాటం..

మృతుల్లో చౌడేశ్వరి నగర్‌కు చెందిన తాడి కృష్ణవేణి (75), భాగిశెట్టి కనకరత్నం (76) ఆదివారం మరణించగా చికిత్స పొందుతూ సోమవారం ఎన్.శేషగిరిరావు (72) రాధా కృష్ణమూర్తి (74) కన్నుమూశారు. బాధితుల్లో ఐదు నెలల పసికందుతో పాటు పలువురు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒక చిన్నారికి డయాలసిస్ నిర్వహిస్తుండగా మరో ఇద్దరు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్నారు.

అరుదైన లక్షణాలు.. కిడ్నీలు ఫెయిల్

బాధితుల్లో అసాధారణ ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. పాలు తాగిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో పాటు ఒక్కసారిగా మూత్ర విసర్జన నిలిచిపోవడం (అనూరియా) వంటి లక్షణాలు బయటపడ్డాయి. ఇది చివరకు ఆకస్మిక మూత్రపిండాల వైఫల్యానికి (అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్) దారితీస్తోంది. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారేనని వారి మూత్రపిండాలపై ఈ కల్తీ పాలు తీవ్ర ప్రభావం చూపాయని వివరించారు.

విక్రేత అదుపులోకి.. 106 ఇళ్లలో తనిఖీలు

ప్రాథమిక విచారణలో బాధితులందరూ కోరకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి వద్ద పాలు కొనుగోలు చేసినట్లు తేలింది. నిందితుడు గణేష్ ప్రతిరోజూ ఉదయం రాజమహేంద్రవరం పరిసరాల్లోని సుమారు 106 ఇళ్లకు పాలు సరఫరా చేస్తున్నాడు. నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే నిందితుడికి చెందిన అనధికార డెయిరీ యూనిట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

యుద్ధప్రాతిపదికన వైద్య సహాయం

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బాధితులను పరామర్శించి, ప్రత్యేక ప్రతిస్పందన బృందాలను రంగంలోకి దించారు. ప్రభావిత ప్రాంతాల్లోని 106 ఇళ్లలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని ఇప్పటివరకు 73 కుటుంబాల నుంచి నమూనాలను సేకరించామని ఆమె తెలిపారు. పశుసంవర్ధక శాఖ అధికారులు 46 పశువులను పరీక్షించగా ఆహార భద్రతా అధికారులు సేకరించిన పాలు, పెరుగు నమూనాలను హైదరాబాద్ మరియు విశాఖపట్నంలోని ల్యాబ్‌లకు పంపారు.

ప్రభుత్వం కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు

ఈ విషాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో స్పందిస్తూ, బాధితుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. "ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై 360 డిగ్రీల విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని హామీ ఇచ్చారు. అటు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆహార భద్రత అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. తక్షణమే నిపుణుల బృందాలను రంగంలోకి దించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రయోగశాల నివేదికలు వస్తే తప్ప ఈ 'తెల్లటి విషం' వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో స్పష్టత రాదని అధికారులు పేర్కొంటున్నారు. అప్పటి వరకు ప్రజలు పాలను బాగా మరిగించి తాగాలని అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని ఎస్పీ డి. నరసింహ కిషోర్ సూచించారు.

రాజమహేంద్రవరంలో ‘కల్తీ పాల’ విషాదం - Tholi Paluku