
రాజధాని విస్తరణ కోసం మలివిడత ల్యాండ్ పూలింగ్ కు ఏపి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
రాజధాని అమరావతి విస్తరణ కోసం మలివిడత ల్యాండ్ పూలింగ్ కు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని మంత్రి నారాయణ తెలిపారు. రెండో విడత లో మొత్తం ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకునేందుకు కేబినెట్ అంగీకరించిందని ఆయన చెప్పారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సచివాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ … రాజధానిలో రాబోయే 30 ఏళ్లకు సరిపడా ప్రజల జీవన స్థితి ఉండేలా కార్యాచరణ రూపొందించినట్లు, అమరావతి రాజధానిలో ప్రస్తుతం ఉన్న భూముల రేట్లు పెరగాలన్నా, గ్రోత్ రేట్ పెరగాలన్నా ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీలు తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లేనిదే ఈ ప్రాంతం అభివృద్ది చెందదు. అందుకే 500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారన్నారు.
అమరావతి చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు,రైల్వే ట్రాక్,రైల్వే స్టేషన్,ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటికి సంబంధించి 16,666.56 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని మంత్రి తెలిపారు.
వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడిలో 7,562 ఎకరాలు, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమిలో 9,104.57 ఎకరాలు కలిపి మొత్తం 16,666 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఇదికాకుండా ప్రభుత్వ భూమి మరో 3,828 ఎకరాలు ఉంది. వీటిలో ఎక్కువగా కొండలు ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ లో భూములిచ్చిన రైతులకు గతంలో ఇచ్చిన విధంగానే నిబంధనలు అమలుచేస్తామన్నారు. జరీబు భూమికి నివాస ప్లాటు 1000 చదరపు గజాలు, వాణిజ్య ప్లాటు 450చ.గ, మెట్ట భూములకు నివాస ప్లాటు 1000చ.గ, వాణిజ్య ప్లాటు 250చదరపు గజాలు కేటాయిస్తాన్నారు. కౌలు కూడా గతంలో మాదిరిగానే చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేసారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి పంపించిన తీర్మానాలను కేబినెట్ ఆమోదించినట్లు మంత్రి చెప్పారు.
గతంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాలు మాత్రమే కేటాయించామని, ఒలింపిక్ వంటి ఇంటర్నేషనల్ క్రీడలు నిర్వహించాలంటే 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని అన్నారు. ఇలా జరిగితే ఎకనమిక్ గ్రోత్ పెరిగి తద్వారా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పెరుగుతుంది. ఎయిర్ పోర్టుకు, స్మార్ట్ ఇండస్ట్రీస్ కు కూడా ల్యాండ్ పూలింగ్ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారని మంత్రి తెలిపారు.
గతంలో భూములిచ్చిన రైతులందరికీ ప్లాట్లు ఇచ్చామని, అయితే కొన్ని చోట్ల జరీబు, నాన్ జరీబు సమస్యతో పాటు రోడ్డు శూల, గ్రామ కంఠాల భూమలు అంశంపై రైతులతో మాట్లాడుతున్నట్లు మంత్రి చెప్పారు. గ్రామ కంఠాల విషయంలో ఎవరికైనా పొరపాటున ఎక్కువ భూమి ఇచ్చి ఉంటే వెనక్కి తీసుకోవాలని సీఎం చెప్పారన్నారు. నెలరోజుల్లోగా ఆయా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మరోవైపు అసైన్డ్ రైతుల సమస్యను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తుందన్నారు. ఇక రైతుల రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుందని మంత్రి నారాయణ తెలిపారు..
